పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0117-3 దేసాళం సంపుటం: 07-099

పల్లవి:
ఇప్పుడేమి కడమా యెన్నాళ్ళకైనాను
అప్పులిచ్చే రమ్మనవే అల్లనాఁటి నవ్వులు

చ.1:
చిత్తమెఱిఁగినదాన చేరి కోపగించేనా
యెత్తి యిచ్చలాడఁగాక యింకా నేను
తత్తరమింతటిలోనే తనకేల రమణుఁడు
హత్తుకొను రమ్మనవే అల్లనాటి పొందులు

చ.2:
మొగము చూచినదాన ముంచి నేరాలెంచేనా
జిగిఁ దాను చెప్పినట్టు సేసేఁ గాక
తనగి సిగ్గులదేలే తానాకుమేలువాఁడు
అగపడె రమ్మనవే అల్లనాఁటి వలపు

చ.3:
ఇంటికి వచ్చినదాననెగసక్కెము సేసేనా
పెంటలుగాఁ గాఁగిటిలోఁ బెనఁగేఁ గాక
దంట శ్రీ వేంకటేశుఁడు తానే నన్నుఁగూడినాఁడు
అంటీననే రమ్మనవే అల్లనాటి మాఁటలు