పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-6 శ్రీరాగం సంపుటం: 08-006

పల్లవి:

పదరుదురా యిటు పైపైపనే
అదన నీకు మోహపు వాఁడతఁడు

చ. 1:

చెలువుఁడు నీకటు సేసిన బాసలు
తలఁచుకొనఁగదవె తరుణీ
అలుగక ములుగక ఆతనిగుణములు
తెలసుకొనఁగదవె దినదినములను

చ. 2:

అంతరంగమున నాడిన మాటలు
చింతించుకొనవె చెలియా
పంతములాడక పలుమరుఁ గొసరక
పొంతనె కనుకో పూఁటకుఁ బూఁట

చ. 3:

శ్రీవేంకటపతి చెనకిన చెనకులు
భావించి చూడమో పడఁతీ
యీవిభుఁడె కలసె నిఁక నేమిననక
ఆవటించు ముదమడగడుగుకును