పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0250-2 సామంతం సంపుటం: 08-296

పల్లవి:

ఉండరే యెక్కడిసుద్ది వొడఁబరచకురే
యెండలెల్ల నీడలాయ్ నిద్దరికి మాకు

చ. 1:

కూరిమిలేనిపొందు కొనలెటువలెసాగు
పేరులేని పిలుపులు ప్రియమెట్టౌను
తారుకాణించేనంటే తానాడ నేనీడ
మారుత్తరమియ్యరాదు మనసులేయెరుఁగు

చ. 2:

నగవురానిమేలము నయమెటువలెనౌను
మొగముచూడని మొక్కు మోచేదేడ
తగులఁబెట్టేనంటే తతిలేదు మితిలేదు
పగటు లాడఁగరాదు పట్టినదేపంతము

చ. 3:

పలచఁగానిసిగ్గులు పనకెటువలెవచ్చు
చలివాయనివలపు సాదించేదెట్టు
యెలమి శ్రీవెంకటేశుఁ డీడనుండె నన్నుఁగూడె
వెలపరచఁగరాదు వేడుకలేనిండెను