పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0250-1 ముఖారి సంపుటం: 08-295

పల్లవి:

ఊరకుండుమనవే వొక్కటొక్కటే రేఁచక
తేరకత్తె నైతేనేమి తిద్దుబడి తనదే

చ. 1:

తగిన నాచెలువము తనకె శలవాయ
పొగడఁగవలెనా పొరుగులను
నగిన నానగవులు ననుపులకునువచ్చె
మగనాలనైతేనేమి మనువెల్లాఁ దనదే

చ. 2:

పట్టిన నాపంతమిది పైపై దనలోనాయ
అట్టె నన్నేల మెచ్చీనె అందరితోను
తిట్టిన నాతిట్టులివి దీవెనలై సరిదాఁకె
చుట్టమనై తేనేమి సొమ్మయితిఁ దనకే

చ. 3:

యిల్లిదె నాజవ్వనము యెప్పుడూఁ దనకెఅబ్బె
వెల్లవిరి సేయనేలె వీధివీధిని
చెల్లుబడితోఁ దానె శ్రీవెంకటేశుఁడుగూడె
గొల్లదాననైతేనేమి కొలుమోల్లాఁ దనదే