పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0249-6 హిందోళవసంతం సంపుటం: 08-294

పల్లవి:

ఏఁటికి వేగిరపడే వింతలో నీవు
మేఁటిరమణుఁడ నిన్నె మెప్పించిఁగాకా

చ. 1:

మచ్చికసేసినచెలి మాటలాడకమానీనా
దిచ్చరి నీతలఁపులు దెలిసీఁగాక
యిచ్చకము నీవాడఁగా నియ్యకొనకుండీనా
కచ్చుపెట్టి కొంతగొంత కైకొనీఁగాక

చ. 2:

దగ్గరి‌ వచ్చినచెలి తప్పకచూడకుండీనా
సిగ్గులు నీపైఁ గొంత చిమ్మీఁగాక
వొగ్గి విడెమిచ్చినాపె వోపననీనా యిఁక
నిగ్గులవలపు నీకు నేరిపీఁగాక

చ. 3:

చేకొని కూడినమీఁద సేవసేయకమానీనా
యీకడ ముందువెనక లెంచీఁగాక
శ్రీకాంతనేలితివి శ్రీవెంకటేశ్వర నేఁడు
మాకొరకు నిన్నాపె సమ్మతింపించీఁగాక