పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0249-4 మంగళకౌశిక సంపుటం: 08-292

పల్లవి:

ఎందాఁకాఁజూతుము నే మిటువంటి యాగడాలు
అందినచెలులము నే మాడకుండరాదు

చ. 1:

వువిద తాఁ బెట్టె తొంటి వుంగర మిమ్మంటేను
యివల నింతదొరవు యేల తిట్టేవు
జవళిగన్నీరుతోడ చలపట్టుకుండఁగాను
తవిలి నీకింకా నేల దయపుట్టదు

చ. 2:

నీలాగులుచూచి యాపె నీబాస వొప్పగించితే
కోలుముందుగా నేల కొంగువట్టేవు
తూలెటినెరులతోడ దోసిలించి మొక్కఁగాను
పాలుపడి దోసానకు భయమేలవుట్టదు

చ. 3:

పడఁతి నీగుణాలకు పయ్యద బిగించుకొంటే
సడిఁబెట్టి నీవేల చన్నులంటేవు
తొడరి శ్రీవెంకటేశ దొమ్మిఁగలసితి వాపె
జడిసి గోరంటినా నెచ్చరి కేలపట్టదు