పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0247-6 ఆహిరి సంపుటం: 08-282

పల్లవి:

నెలఁతఁ బాసితే నీకు నిమిష మేఁడవును
యెలమి దగ్గరివుంటే నేఁడు నిమిషమవును

చ. 1:

కన్నులఁ బెట్టినయట్టి కాటుకచూపులు నీపై
పన్ని చెలి చల్లితేనె పగలు రేయౌ
వున్నతి పద్మరాగాల వుంగరాలచేతినిన్ను
తిన్నఁగా నంటితే నట్టె తెల్లవారును

చ. 2:

వీడెపు మోవిసెలవి వేడుకతో నవ్వితేను
నీడలఁ గాసిన వెల్లా నిండు వన్నెలౌ
పాడితో యించుకవడి ప్రణయకలహమయితే
యేడచూచినా నదె యెండగానును

చ. 3:

శ్రీవెంకటేశ యిట్టె చెలి నిన్నుఁగూడెఁగాన
సోవలుగా మోవిమీఁదఁ జుక్కలు నిండె
వేవేలు రతులచేత వెలయఁగా దిక్కులెల్ల
కావిరి మాని హృదయకమలము నించెను