పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0246-4 శ్రీరాగం సంపుటం: 08-274

పల్లవి:

ఎరుఁగుదుము నీ నాయా లేల చెప్పేవు
వొరిమె గలవాఁడవు వూరకుఁడ రాదా

చ. 1:

మొగమోట గలవారు మోహించిన సతులకు
తగవు చెప్పేరా తప్పకుండాను
మగఁడ వై తేనేమి మచ్చికగలచోటికి
తెగెవా పరులకైతే దీకొందువుగాక

చ. 2:

చుట్టపుఁ బొందైనవారు చూచి చూచి సవతుల
యెట్టయినా వున్నట్టే యేలాడేరు
దిట్ట వైతేనేమి నీతీరుకు వచ్చేవారిఁ జే
పట్టవా వింతవారైతే భ్రమయింతువుగాక

చ. 3:

కడు వేడుకకాండ్లు గలిగినట్టె ధర్మము
నడుపేరా శ్రీవెంకటనాయక నేఁడు
అడరి నన్నుఁ గూడితి వాపెనుఁ గొంతమాత్రము
విడిచేవా యిది నీ వేసా లింతేకాక