పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0246-2 వరాళి సంపుటం: 08-272

పల్లవి:

గుట్టుతోడిదాన నేను కొసరనేల
దిట్టతనమె నాది తెలుకొనవయ్యా

చ. 1:

పెక్కుమాట లాడఁగాను ప్రియుఁడ నీతో నేను
వొక్కటి హితవౌను వేరొక్కటిగాదు
చక్కటులు నీవాఁడితే సారెకు వినేఁగాని
అక్కరతో మారుమాట లడుగకువయ్యా

చ. 2:

సారె నీతో నవ్వఁగాను చప్పనవునో వుప్పనవునో
తేరకొనని మనసు తిద్దుకోరాదు
కేరి నీవు నవ్వితేను కిమ్ములఁ జూచేఁగాని
ఆరయ నన్నుఁ గలుపే వంతయేఁటికయ్యా

చ. 3:

నిన్ను బాసగొనఁగాను నిలుపుదువోమరి
సన్నలఁ దోతువో అంతసాధించనేల
యెన్నఁగ నన్నుఁ గూడితి విదిగో శ్రీవెంకటేశ
వెన్నవంటి నయముతో వేఁడుకోనేలయ్యా