పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0245-2 కాంబోది సంపుటం; 08-266

పల్లవి:

ఏమయ్యా నే మంతేసి యెఱఁగనివారమా
కామించితే నీమాట కాదనఁగఁ దరమా

చ. 1:

సలిగెంత గలిగినా సరస మాడుటెకాక
మెలఁగి నీకంటె మితిమీరవచ్చునా
వలపు మిక్కిలియైతె వసమై చొక్కుటగాక
కలఁచి కలఁచి నిన్నుఁ గక్కసించఁదగునా

చ. 2:

నగవెంత దఱచైన ననుపై యుండుటగాక
మిగులా మందెమేళాల మించనగునా
మొగమెంత చూచినా మొక్కులె మొక్కుటగాక
యెగసక్యాలకు నిన్ను యేఁపఁదీరునా

చ. 3:

నీవెంత మన్నించినా నిన్నిట్టె కూడుటగాక
చేవదేర నిన్నుఁ బచ్చి సేయఁగూడునా
యీవేళ శ్రీవెంకటేశ యేలితి విటు నన్ను
ఆవటించి నిన్ను రతి నలయించఁజెల్లునా