పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0245-1 శ్రీరాగం సంపుటం: 08-265

పల్లవి:

చెప్పినట్టు సేయకున్న చిన్నఁబోరాదు
కప్పురగందులకెల్లాఁ గల దిదె చాలు

చ. 1:

చనవు లేనిచోటి జగడాలు
పెనఁగఁబోతే వట్టి పిరివీకులు
కనుకొని మాటాడరె కాంతలు
వనితల కిందరికి వాసితోడి బతుకు

చ. 2:

అందియు నందనిచోటి యాసలు
సందడిఁ బెనఁగఁబోతే సటవటలు
పొందులు దెలుసుకోరె పొలఁతులు
చెందిన యింతుల కెల్ల సిగ్గు మూలధనము

చ. 3:

అలసిన రతిలోని యలుకలు
చలపట్టఁబోతేను సదమదము
కలసె సన్నిదె శ్రీవెంకటవిభుఁడు
లలనలకెల్లా నీలాగులెపో లంకెలు