పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0241-3 రామక్రియ సంపుటం: 08-243

పల్లవి:

గడుసుఁదన మేఁటికి కలికి మోనమటే
తడవకున్న దిట్టతన మిదియనఁడా

చ. 1:

పంతమాడరాదుగాక పతితోడ సతికిని
అంతరంగమైనఁ గొంత ఆనతీరాదా
మంతుకెక్కి వద్దనుండి మారుత్తరాలియ్య విదే
కాంతుఁడు నీకిదియెల్లా గర్వముగాఁ జూడఁడా

చ. 2:

తిట్టరాదుగా కతనిఁ దేరిచూచి నీకింతేసి
తెట్టెలుగా మొక్కఁగాను దీవించరాదా
చెట్టవట్టి పెనఁగఁగాఁ జెప్పఁగదే వినయాలు
గుట్టుతోడ నుండితేను కుచ్చిత మిదనఁడా

చ. 3:

బాధించరాదుగాక బడి శ్రీవెంకటేశ్వరుఁ
బాదుగాను మెచ్చి మెచ్చి పాడరాదా
యీదెస నలమేల్‌మంగ వెనసితి వితని
పోదితో నిటుగాకున్న పొరపొచ్చ మెంచఁడా