పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0221-5 శుద్దవసంతం సంపుటం: 08-125

పల్లవి:

ఇద్దరుఁ గదిసి కొంకనిఁక నేఁటికే
చద్దివేఁడి సరసాలు సరిచూడరాదా

చ. 1:

కదలించేవవునవునే గక్కున విభుఁనితోడ
పెదవిమరఁగుననె పెనుమాటలు
వుదుటుఁ దమకమున నోపిక కలిగితేను
యెదుటి మరుసామున కియ్యకొనరాదా

చ. 2:

పన్ని వేసే వవునవునే పదరి యాతని మీఁద
కన్నురెప్ప మరఁగల కాముబాణాలు
సన్నల మీలోనింత చనవులు గలిగితే
నున్నతపు రతికేలి నొరయఁగ రాదా

చ. 3:

నెట్టన నొత్తేవేమే నీవు శ్రీవేంకటేశ్వరు
పుట్టిన పయ్యదమాటు పూబంతుల
ఱట్టుగాఁ గూడితివి మీఱఁగ రాజసము మించి
తొట్టిన మదములను దొమ్మిసేయరాదా