పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0221-4 వరాళి సంపుటం: 08-124

పల్లవి:

ఇందవయ్య వీడెమిఁక నెరవులేవి
సందులేని కూరిమికి జగడములేవి

చ. 1:

చిత్తములేకములైతే సిగ్గులెందు వెదకేది
కొత్తవలపులై తేను కొంకఁ జోటేది
పొత్తుల భోగములైతే పొద్దులు దెలియనేది
అత్తిన సంసారఫలమయి వుండుఁగాక

చ. 2:

వాడికెలు గలిగితే వంచన సోదించనేది
వేడుకలు మించితేను వెలువలేవి
ఆడుకోలు మాటలకు నవుగాములు మరియేవి
యీడనే జన్మఫలము లీడేరుఁ గాక

చ. 3:

కూటములు గలిగితే గురుతులు వెట్టనేది
వాటపు నవ్వులకున వరుసేది
మేటి శ్రీవేంకటేశుఁడ మించి నన్నుఁ గూడితివి
పాటించి జవ్వన భాగ్యఫలమంటుఁ గాక