పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0220-2 రామక్రియ సంపుటం: 08-116

పల్లవి:

మాకేమి బుద్ధి చెప్పేవు మాటి మాటికి
జోకలతో నీవాపెకు చుట్టమవే కావా

చ. 1:

మక్కువ గలవాఁడవు మానిని వేఁడుకోరాదా
చెక్కుచేతితోడ లోనఁ జింతించీని
యెక్కువ తక్కువ మాటలిద్దరము నాడుకొంటే
చొక్కముగా నీవాపెకు చుట్టమవే కావా

చ. 2:

నగవులవాఁడవు నవ్వించరాదా ఆపెను
వగ విరహానఁ దలవంచు కున్నది
యెగసక్యాలు మాలోనెటువలెనుండినాను
సొగసి నీవాపెకు చుట్టమవే కావా

చ. 3:

అట్టె చెనకేవాఁడవాపె చెక్కు నొక్కరాదా
దట్టపు నీరతిఁగూడి దగ్గరున్నది
గుట్టున శ్రీవేంకటేశ కోరినన్నుఁ గూడితివి
చుట్టిచుట్టి తొల్లేపెకు చుట్టమవే కావా