పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0220-1 శంకరాభరణం సంపుటం: 08-115

పల్లవి:

ఏల పెనఁగేవునాతో నిట్టె విన్నవించుమని
వేళలెరఁగక నీతో వివరించఁగాని

చ. 1:

ఆయాలు సోఁకిన మాటలవియే యితవుగాక
చాయపాట్లైనవెల్లా చవివుట్టీనా
నీయడ కాపె నేరుచు నేనూఁగొంతనేరుతు
వేయైనా నీవడుగక వెళ్లనాడఁగాని

చ. 2:

సొలసి సొలసి చూచే చూపులే వేడుకగాక
అలవోకలవి యెల్లా నాసరేఁచీనా
అలరి నిన్నాపె చూచు నావెనుక నేనుఁజూతు
బలిమి దెలియక నేఁ బచరించఁగాని

చ. 3:

గక్కనఁ గూడినయట్టి కలయికే మేలుగాక
తక్కక పెనఁగినవి తమినించీనా
యిక్కువ శ్రీవేంకటేశ యిద్దరము గూడితిమి
చెక్కులు నొక్కక నీపై చెయి చాఁచఁగాని