పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-6 సాళంగనాట సంపుటం: 08-114

పల్లవి:

ఇందరితో నేకతాలు యెందాఁకాను
మందలించి ఆతనికే మచ్చికలుచూపవే

చ. 1:

మోహమే నిజమైతే ముచ్చటలు నిజమే
సాహసము నిజమైతే జయమూ నిజమే
వూహ పోహలు సారె వువిదతో నేలే
కూహకములేల పతికొంగు వట్టి తియ్యవే

చ. 2:

నయములు గలితేను ననుపులుఁగలవే
ప్రియములు గలిగితే పిలుపులుఁ గలవే
దయపుట్టఁ జెప్పియంపే తగువిన్నపములేలే
నియతి నాతని నీలోనికిఁ దియ్యరాదా

చ. 3:

చనవులు దొరకితే సంతసాలు దొరకును
చెనకులు దొరకితే సిగ్గులు దొరకును
యెనసెను శ్రీవేంకటేశుఁడు నిన్నింతలోనే
చనుమొనలనొత్తి బాసలు గొనరాదా