పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0218-1 దేవగాంధారి సంపుటం: 08-103

పల్లవి:

బాపు బాపు యిఁకనాకుఁ బరిణామము
ఆపనులెల్లానావి అదియే నావలపు

చ. 1:

మంతనాన నీవు నాపె మాటలాడఁగాఁ జూచి
చింతలెల్లఁ బాసి యేక చిత్తమాయను
వంతులకు నే నీకు వలతునాపెకు నీవు
అంతకంటె వలతువు అదియే నావలపు

చ. 2:

చలివాసి యిద్దరును సరసమాడఁగఁ జూచి
బలిమి నాజన్మము సఫలమాయెను
అలరి నే నీకు లోను ఆపెకు నీవులోనై
అలవాటాయఁ గనక అదియే నావలపు

చ. 3:

మంచముపై నిద్దర నెమ్మదినుండఁగాఁ జూచి
సంచమై నామేనెల్ల చల్లనాయను
యెంచఁగ శ్రీవేంకటేశ యిద్దరము నీసొమ్ము
అంచెలఁ గూడితిమిదె అదియే నావలపు