పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0217-5 ముఖారి సంపుటం: 08-101

పల్లవి:

వీఁపుగానరాఁగా దాఁగే విధమేఁటికే
తోపునకుడిందునేది దొరసానివిపుడు

చ. 1:

నీరాక గోరుకొని నిలుచున్నాఁ డితఁడు
యీరీతినే వద్దనుంటే నేల లోఁగేవే
పేరే నా వరుస గాక పెనఁగేటినారతులలో
దూరల్లా నీదేకాదా దొరసానివిపుడు

చ. 2:

మాటలు నీవాడేవంటా మలసు కొన్నాఁడతఁడు
యేఁటికే నన్నుఁజూచి యేల లోఁగేవే
కూటమే నాదిగాక గురుతులు సోకించేటి
తూఁటరివి నీవుగావా దొరసానివిపుడు

చ. 3:

సరినీవు చూచేవంటా సన్నలు సేసీ నతఁడు
యిరవై నేఁ దిట్టేనంటా నేల లోఁగేవే
అరిది శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
తొరలఁ గూడితిమిదే దొరసానివిపుడు