పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అటుపిమ్మట అగ్ని వంశపురాజులు ఇంకను విభాగములు అయి యుండవచ్చును. పల్లవచేత, సేన, కదంబ, రాష్ట్రకూట, విష్ణుకుండిన, బృహత్ఫలాయన, బాణ, గాంగ, హోసల, రాజపుత్ర, శాలంకాయన, వాకాటక, వల్లభివైదుంబ, నోలంబ వంశములవారందరు ఆంధ్ర శాతవాహనవంశీయులకు చెందిన రాజబంధువులు. అందు రాజపుత్రులు అనగా రాజుల కుమాళ్ళు అని యర్థము. శాతవాహన రాజులకు కలిగిన సంతానములో జ్యేష్ఠ పుత్రులు రాజ్యమునకు వారసులు కాగా తక్కిన కుమాళ్ళకును, కుమార్తెల నిచ్చి వివాహ మొనర్చిన అల్లుళ్ళు మొదలుగాగల సన్నిహిత రాజబంథువులకును రాజపుటానాలో అల్పరాష్ట్రముల నేర్పరచి వారిని ఆరాష్ట్రములకు ప్రభువులుగా చేసియుండిరి. రాజపుత్రవంశములు అట్లు ఏర్పడినవే, వారినుండియే ప్రమర లేక పరమార, చపహాని లేక చాహుమాన, శుక్లలేక చాళుక్య పరిహార లేక ప్రతీహార అనబడు నాలుగు అగ్నివంశము లేర్పడినవి. అట్లేర్పడిన "అగ్నివంశము"లనే గాక రాజపుత్ర వంశములన్నిటిని బ్రహ్మక్షత్రులని పిలిచెడివారు. అగ్ని వంశములకు మూలపురుషులైన పైనలుగురును వేదవేదాంగముల నధ్యయనము చేసిన సద్బ్రాహ్మణులు. వారిని గురించి పురాణ మిట్లు చెప్పుచున్నది:-

                 "ప్రమర స్సామవేదీ చ, చపహాని ర్యజుర్విద:|
                  త్రివేదీ చ తథా శుక్లో థర్వణ స్స పరిహార:||
                                                (భవిష్యమహాపురాణము-ప్రతిసర్గపర్వము)

తా|| ప్రమరుడు సామవేదము నథ్యయనము చేసినవాడు, చపహాని యజు ర్వేదాధ్యాయి, శుక్లుడు మూడువేదముల నధ్యయనము చేసినవాడు, పరిహారకుడు అథర్వణ వేదము నధ్యయనము చేసినవాడు.

కలి 2710 సంవత్సరమున (క్రీ. పూ. 392) పండితులును తపశ్శాలురునగు పైనలుగురిని అర్బుద పర్వతముమీద (రాజపుటానాలో గలదు) వారియందు క్షాత్రతేజస్సు నిల్చినటుల సంకల్పించి వారిచే అగ్ని