పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ష్ణాది భేదములచే ఒక్కటైన ఆర్యజాతి ఆకారరూపభేదముల నొంది అనేక జాతులుగా పేరులను పొందియున్నది.

ప్రాచీన భారతవర్షము

ప్రాచీన భారతవర్షము తూర్పు పశ్చిమసముద్రముల మధ్యస్థమై ఉత్తరమున హిమాలయమును దక్షిణమున నిరక్ష రేఖకు దక్షిణముగా నుండిన ఉప్పుసముద్రమును హద్దులుగా గల ప్రదేశమై యున్నది. తూర్పుసముద్ర మనగా పసిఫిక్కు సముద్రము. పశ్చిమసముద్ర మనగా అట్లాంటిక్కు సముద్రము అని తెలియవలెను. భారతవర్షమునకు దక్షిణసరిహద్దున గల నిరక్ష రేఖకు దక్షిణముగా గల "లంక" నుండి (ఈలంక యిప్పుడు లేదు. అది సముద్రగామి యైనది. సింహళము వేరు. 'లంక ' వేరు అని తెలియవలెను.) పడమరగా నిరక్ష రేఖమీద ఏబదవ (50*) డిగ్రీవద్దనుండి ప్రారంభించి లంకకు తూర్పుగా నిరక్ష రేఖమీద ఏబది డిగ్రీలవరకు భారతవర్షము వ్యాపించి యుండెడిది. ఇందు ఉత్తర, ఆఫ్రికా యంతయు తూర్పునగల ఇండోచీనా వగైరా ప్రదేశమంతయు భారతవర్షములో చేరియుండెడిది. కాలక్రమమున సుమారు ఐదుకోట్ల సంవత్సరముల క్రిందట దక్షిణ భారతవర్షమున నిరక్ష రేఖనుండి ఉత్తరముగా సుమారెనిమిది డిగ్రీలవఱకు సముద్రగామి యైనట్లు మన పురాణములు చెప్పుచున్నవి. ఇచట 'లెమూరియా' యనెడి ఖండమొకటి యుండెడిదనియు అది ఆఫ్రికానంటి తూర్పుగా అమెరికావఱకు వ్యాపించి మూడుకోట్ల సంవత్సరములక్రిందట ఉండినట్లును అది సముద్రగామి యైనట్లును ఇప్పుడు భూగర్భ శాస్త్రజ్ఞులు (Geologists) చెప్పుచున్నారు. అదే ప్రకారము ఆఫ్రికా తూర్పుభాగమునకును ఇప్పటి భారతవర్ష పశ్చిమభాగమునకును మధ్యగల భూఖండము సముద్రగామియైనది. అదియే అరేబియా, హిందూ మహాసముద్రములుగా ఇప్పుడు పిలువబడుచున్నది. అట్లుమునిగిపోయిన భూఖండమే 'గాండ్వానాలాండ్‌' (Gandwanaland) అని పేరుపెట్టబడి అదియు మూడుకోట్ల సంవత్సరముల క్రిందట మునిగి పోయినట్లు భూగర్భ శాస్త్రజ్ఞు లిపుడు చెప్పుచున్నారు.