పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గల వంగదేశ ప్రాంతములమీదుగా దక్షిణమునకు క్రమక్రమముగా వ్యాపించిరి. అనేక సంవత్సరములు గడచుచుండగా అట్లు ఆర్యులు వ్యాపించిన భారతవర్షపు తూర్పుదక్షిణములగల (అనగా ఇప్పటి మద్రాసు దిగువ వఱకు) ప్రదేశము "ప్రాచ్యకదేశ" మని పిలువబడినది. దానికి దక్షిణముగా దక్షిణసముద్రమువఱకు గల దేశము దక్షిణ దేశమయ్యెను. ఆరెంటికి పశ్చిమముగా గల పశ్చిమకోస్తాప్రదేశము పశ్చిమదేశ మయ్యెను. అదేవిధమున ఆర్యులు "దక్షిణాపథ" మంతయు నాక్రమించి వృద్ధిపొందిరి. ఆసేతుహిమాచలముగా గల దేశమునంతను ఆక్రమించిన ఆర్యులు వైదిక ధర్మావలంబులై చాతుర్వర్ణ్య వ్యవస్థ గలిగి యుండిరి.

యజ్ఞీయ దేశము

నల్లచారలుగలలేడి స్వాభావికముగా ఎచ్చట పుట్టి చరించు చుండునో ఆదేశము "యజ్ఞీయ దేశ" మని తెలియవలెను. అంతకు ఇతరమైన దేశము మ్లేచ్ఛ దేశమని తెలియవలెను. అని మనువు చెప్పుచున్నాడు. నేటి భారతవర్ష మందంతటను (ఇంకను ఉత్తర ఆఫ్రికా, అమెరికాలో కొన్ని భాగములలోను) నల్ల చారలుగల లేడి స్వాభావికముగా పుట్టి సంచరించుచున్నది. అందువలన ఈభారతవర్ష మంతయు 'యజ్ఞీయదేశ'మై యున్నది. ఇట్టి స్వభావముగల ఇతర ప్రాంతములన్నియు యజ్ఞములు చేయుట కర్హములైనవని చెప్పవచ్చును. (మను 2-17, 19, 21, 22, 23 శ్లోకములు చూడుడు.)

దస్యులు

ఈవిధముగా ఆర్యులు భారతవర్ష మంతయు నిండిరి. కానికాలక్రమమున వారిలో వేదధర్మముల నాచరించక మాని వేదనింద యొనర్చువారు కొందరు బయలుదేరిరి. అట్టివారిని ఆర్యులు తమ సంఘమునుండి బహిష్కరించి వారితో భోజన ప్రతిభోజనములు, సంబంధబాంధవ్యములు చేయుట మానిరి. అట్టి ధర్మబాహ్యులు, అనా