పుట:VrukshaSastramu.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎర్రకలువగింజలు, అజీర్ణమునకును, వేళ్ళు జిగట విరేచనములు, రక్త విరేచనములకును బని చేయును. వీనినెండ బెట్టి పొడుముగొట్టి పుచ్చుకొనవచ్చును. ఇతర కలువలకును దామరలకును గూడ నీగుణములు గలవు. కాని అన్ని తెగలను గలిపి మందుచేయుట కంటే విడివిడిగా జేయుట మంచిది.


గసగసాల కుటుంబము


గసగసాలమొక్క 2 మొ. 4 అడుగులవరకు బెరుగును. కొమ్మలు విరిచిన తెల్లని పాలుగారును.

ఆకులు:- ఒంటరి చేరిక, లఘుపత్రములు. అండాకారము. తమ్మెలు గలవు కణుపు పుచ్చములులేవు. తొడిమ పొట్టిది. అంచునందురంపపు పండ్లు గలవు.

పుష్పమంజారి:- కణుపు సందులందుండి మధ్యారంభమంజరి. వృంతము పొడుగు పుష్పము పెద్దది. సంపూర్ణము సరాళము.

పుష్పకోశము:- రెండు రక్షక పత్రములు. నీచము. ఆకు పచ్చగా నుండును.

దళవలయము:- ఆకర్షణపత్రములు 4 వరుసకు రెండువంతున రెండు వరుసలు, అంచులు మడతలు మడతలుగానున్నవి. వృంతాశ్రితము. తెలుపు రంగు కొన్ని ఎర్రగా నుండును.

కింజల్కములు:- కాడలు వెడల్పుగానుండును. వృంతాశ్రితము పుప్పొడి తిత్తులు 2 గదులు.

అండకోశము:- ఆండాశయము ఉచ్ఛము. 1 గది అండములు పెక్కులు కుడ్యాశ్రితము కీలము లేదు. కీలాగ్రము గుండ్రము.