పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


21 నల్లకుక్కను ఆవుగ జేయుట

రాయలొకనాఁటి యుదయమున వపనము జేయించుకొనుటకై మంగలికి గబురుచేసెను. ఆమంగలి వచ్చుటకు గొంచె మాలస్యమయ్యెను. ఆతఁడువచ్చి చూచుసరికి రాయలు కుర్చీలో గూర్చుండి నిద్రాముద్రితుడై యుండెను. రాయలకు నిద్రాభంగము జేయుట పాడికాదని, మెల్లగా క్షురకర్మ ముగించి వెడలెను, కొంతసేపైన పిదప రాయలులేచి, తాను నిద్రాబద్దుడై యుండగనే మంగలి క్షౌరముచేసి వెళ్ళిపోవుటచే వాని చాకచక్యమున కెంతయు సంతోషించి, వానికి కబురంపి, 'నీకేమికావలయు?' నని యడిగెను.

'మహారాజా! నాకు జిరకాలమునుండి బ్రాహ్మణుడ కావలెనని యున్నది. నాకు ధనముగాని, మఱేయుఁగాని యక్కఱలేదు. నాకోరిక నెరవేర్చిన జాలును' అని యా క్షురకుడు పలుక , రాయలు 'అదెంతపనియని' బ్రాహ్మణుల రావించి, శుభదినము నిశ్చయింప జేసెను.

శుభదినమున ద్విజు లామంగలిని తుంగభద్రానదికి దీసుకొని వెళ్ళి, స్నానము జేయించి మంత్రములు జదువుచుండిరి. రామకృష్ణ కవి యీ వృత్తాంతమును దెలిసికొన్నవాడై మఱికొందఱు బాహ్మణుల దనవెంట నిడుకొని, నదీతీరమున వారున్నచోటికే పోయి యొకింత దూరముగా నిలువబడి యొక నల్లకుక్కను మాటి మాటికి నీటిలో ముంచుచు, మంత్రపఠన మొనరింపసాగెను. రాయలు సమీపించి 'రామకృష్ణకవీ! కుక్క నేడ్పించు చున్నా వేమి?' అని ప్రశ్నించెను.

రామకృష్ణుడు 'రాజేంద్రా! ఈ శునకమును ఆవుగా జేయవలయునని యిచటకు గొనివచ్చి, మంత్రముల జదివించుచున్నా' నని బదులుపలుక , రాయలు 'అమాయకుడా! పావన స్రవంతీజలస్నానము వలన, వేదమంత్రపఠనమువలన కుక్కగోవగునా? ఈవిచిత్ర మెచ్చట