పుట:TellakagitaM.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెల్లకాగితం

మనిషన్నాకా  ఏవో కొన్ని అక్షరాలు
తనవై ఉంటాయి
పేరో.. ఊరో.. తనవారో..కానివారో  అక్షరాలే..
పలుకుతాయ్, పలకరిస్తాయ్,
పలవరిస్తాయ్, పులకరిస్తాయ్
పగలబడీ నవ్వుతాయ్
 అలవాటైన కొద్దీ ప్రతీదీ నాతో చేరిపోతుంది
నాకు ప్రతీకగా మారిపోతుంది.
నాకు నచ్చని ‘నా’ని పుచ్చుకుని నడవలేను
పచ్చ పొడిపించుకుని తిరగలేను
 పలికిన ప్రతీమాటా నాది మాత్రమే ఐనప్పుడు
నీ మాట నోటరాక.. నేను రాయైపోతాను
నాకు నేనే పరాయై పోతాను
నాది నీదైనప్పుడే నిజంగా నేను మనిషినౌతాను
‘నా’ని వదిలించుకోవాలనో… నన్ను నీలో నిలుపుకోవాలనో
నావైనవన్నీ నీకు పంచేస్తున్నా
నా మెడలు వంచి నీవి చేసి నీకు ఇచ్చేస్తున్నా
నాది నీదైనప్పుడు నేను నీవైనట్లే
అందుకో నన్ను..  నీ ప్రపంచంలోకి కవిత్వమై వస్తున్నా
నీ సాక్షిగా నన్ను నేను పోగొట్టుకోవాలి
నా పేరూ ఊరూ చెరిపేసుకోవాలి
అక్షరాలను ఆవహించుకున్న నన్ను చదివించుకుని
మనసును తెల్లకాగితం చేసుకోవాలి
నేనే నీ సొంతమైనప్పుడు మనమధ్య
అక్షరాలు అనుభూతుల్ని మాత్రమే మిగల్చాలి
అక్షరాలు మనలోనికి  కరిగి స్వచ్ఛమైన తెల్లకాగితం  మిగలాలి
కవిత్వం మన అంతరాంతరాళాల్లోకి ఇంకి..
లోకమంతా తెల్లకాగితమవ్వాలి
(కొప్పర్తి మాస్టారూ!!.. మీ బాటన...)