పుట:TellakagitaM.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏదోకారణం

ఏదో కారణం.. పుట్టాం
ఏనాటి రుణమో.. మనడానికీ, బాగున్నామనడానికి
ఎవరికోసమో.. ఎందుకోసమో జీవిస్తాం.. తపిస్తాం
గతుకుల బండి లాగిస్తాం. . నెట్టుకొస్తాం.
కారణం తెలుసుకోవాలనే కోరిక..
దీనివెనుక ఎవరున్నారు!!
కళ్ళు- కాళ్ళు లేని పిల్లల్ని, ఎదిగీ ఎదగని పసి మొగ్గల్నీ
ఈ జగంలోకి ఎవరు రప్పిస్తారు?
ఆట ఆపేసి పైకో-కిందకో ఎందుకు తోస్తారు!
ఎన్నో అవస్థలతో తెరల్ని ఎందుకు దించేస్తారు?

నేల ఈనినట్టు జనం.. నిస్సత్తువతో ముప్పాతిక
రోగం రొస్టులతో మువ్వీసం ముప్పాతిక
వేగలేక ఆగలేని లెక్కలు ఉన్నన్నీ ఉండనీ..
ఎన్ని మాట్లు అదరలేదు భూమి!!
కోట్ల కలలు నడినిద్దురలోకి జార్చిందెవరు!!
ఉసురు తీసిన వరద; పగిలిన గుండెల వెతలెన్ని!!
దారి మళ్ళింపుల్లో మలుపుల్లో రాలిందెందరు!
రైలు మంటల్లో ఎందుకు కాలాలి!
ఆయిల్ రిగ్గో, కారో ఎందుకు పేలాలి!
బాధ, హింస, అతివాదం, ప్రమాదం,
పశుత్వం, విధ్వంసం , పక్కవాడి నిర్లక్ష్యం
కారణాలు బైటవైనప్పుడు కాలంచెల్లడం సహజన్యాయమా?
నిప్పుకాలుస్తుందనీ, నీరు ముంచేస్తుందనీ,
అపరిశుభ్రత , ఆదమరుపు కుంగదీస్తాయనీ
తెలిసి తరాలు మారినా తలొగ్గలేదు ఈతి బాధలు

కుప్పపోసిన తప్పిదాల మోపుని మోయలేక
ముందుతరాలకు అందివ్వ మనసు రాక.. వగస్తున్నా..
పుట్టించిన వాడినడగాలని పడిగాపులు కాస్తున్నా!
కన్నీళ్ళను కాటుకలో ముంచి రాస్తున్నా.
ఒక్కటి తప్పినా మరొకటి తప్పని..
నాది కాని తప్పుల వలయం లో చిక్కి చచ్చిపోతున్నా.
ఈ తెరమీదకు తెలియకుండా రోజూ వచ్చి పోతున్నా..