పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

26

సహంకారంబవై యుందువు ; దేవతలకు బ్రహ్మపదంబవై యుందువు ; ఈరీతి వారివారికిఁ దగినట్లు నీరుకొలఁది తామరవై యుందువు. ఓపిన వారి కోపినంత భాగ్యంబవు; నీకు శర ణన నేర్చినవారిని నీవే రక్షింతువు ; నీవలనఁ గొఱత లేదు ; శ్రీ వేంకటేశ్వరా !

53

అచ్యుతా ! మిమ్ము నేమియు నడుగ ననియెడు నహంకారంబు గలవాఁడఁగాను; మీ పనుల యెడ నపరాధంబు లేకుండెడు నట్టు కొలుతు ననియెడు గర్వంబు గలవాడం గాను; మిమ్ము నమ్మితి నని సారెసారెకుం గొసరెడివాఁడఁ గాను; మీకు విశ్వాసి నని యెమ్మెలం బొరలెడివాఁడఁ గాను; వేద శాస్త్రంబు లెఱుంగుదు నని పెద్దల ధిక్కరించెడువాఁడఁ గాను; ఆశ్రమాచారంబులు చూపి యుత్తమలోకంబులు చొరఁబాఱి సరిగెల్పు నెఱపెడివాఁడఁగాను; మీమీఁదిభక్తి గలదని బలిమి చూ పెడివాఁడఁగాను; 'శేషత్వ పారతంత్య్రముల మఱుఁగున నిల్చి మిమ్ము సేవించు మీ దాసానుదాసుండ నని యెఱుంగుమా; శ్రీ వేంకటేశ్వరా !

54

భుజగేంద్రశయనా ! లక్ష్మీసమేతులరై యేమేమి సేయుచుంటిరో మీ యవసరం బెఱుంగక మిమ్ముఁ దలంపరాదు. రుక్మిణీ దేవితో నెత్తంబు లాడెడువేళ ద్రౌపది “హా కృష్ణా' యని తలంచిన నక్షయం బని పాచికలు వైచితిరట; కరీంద్రుండు మిమ్ముం దలంచిన వైకుంఠభోగంబు లటువెట్టి వచ్చితిరట; ప్రహ్లాదుండు కంబంబునం జూపెద ననినఁ జించు కొని వెడలితిరట. ఈరీతి మీచరిత్రంబులు విన వెఱఁ గయ్యెడిని, మీవేళచూడక తలంచిన నపచారంబుగదా ! మీయంత మీరెప్పుడు నన్ను మన్నించ విచ్చేయుదురో యని మీ శ్రీ పాదపద్మంబులచప్పుడు నాలకింపుదును. మీకై నేనేవేళనైనను హృదయంపు వాకిళ్లు గాచు చుండెద; శ్రీ వేంకటేశ్వరా !