పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

x

సంకీర్తన లక్షణ పద్యమున నున్నది. ఇంతకముందు నేనుదాహరించిన కృష్ణమాచార్యసంకీర్తనములకర్త కృష్ణాచార్యుడే సంకీర్తనలక్షణకారుఁడు పేర్కొన్న కృష్ణాచార్యుఁడు కాఁగలడు. ఇట్టి రచనములకుఁ గృష్ణమాచార్య సంకీర్తనములనఁబడు సింహగిరినరహరి వచనములే ప్రప్రధము రచనము లని యీ సంకీర్తన లక్షణ గ్రంథోక్తిని బట్టి గుర్తింప నగును. దీనిని లక్ష్యీకరించుకొనియే యనంతామాత్యుఁడు గద్యనిర్వచనము నట్లు చేసియుండును. తర్వాతి కాలమున నిట్టివచనములు ‘విన్నపము’ లనియుఁ బేర్కొనఁబడినవి.

వేంకటేశ్వర వచనములు—వానియోగ్యత

ఈ వచనములకు రచనములో నామపూర్వి యేదియుఁగానరాదు. వస్తువిన్యాసమునఁగూడఁ గ్రమపద్ధతీ యేదియుఁదోపదు. కవియప్పుడప్పుడు తనకుఁ దోచినతత్త్వవిషయముల నీశ్వరస్తుతిపరములు గావించి విడివిడిగనే వచనములుగా రచించినాఁడు గాఁబోలును! ఇందు విశిష్టాద్వైత సిద్ధాంత విషయములు సర్వత్ర కరడుగట్టియున్నవి. గ్రంథకర్త స్మార్తనందవరీక బ్రాహ్మణుఁడైనను వైష్ణవమతము స్వీకరించినవాఁడు. జాలిజాలిగాఁ గొసరికొసరి శ్రీవేంకటేశ్వరస్వామిని గవి యేతద్వచన రచనలలోఁ బలుదెఱఁగులఁ బరమార్థలబ్ధికై ప్రార్థించును. విశిష్టాద్వైత సిద్ధాంతపు జీవగఱ్ఱయగు ‘శరణాగతి’ యిందుఁజాలఁజక్కఁగా సవదరింపఁబడినది. కవి యిందు స్వామిని బలుచోట్ల నేకవచనముననే తేలికగా ‘నీ’ వని యెచ్చరించును. తోడ్తోఁ గొన్నిపట్టుల ‘మీ’ రని గొప్పగా బహూకరించును. తండ్రియొడిలో నాటవేడ్కలతోనుండు ముద్దులబిడ్డఁడు తండ్రిని నెయ్యంపుమురువునఁ దొక్కుబల్కులతో. నీవనితుంకరించుట, యంతలోనే పెద్దఱికపుహద్దుతోపగా మరల మీరని బహూకరించుట, యందం దనుభూయమానమే కదా! ఆయనుభూతి నాకీ తీరునకు సమర్థకముగాఁదోచినది. అన్నిచోట్ల నేకవచనమునో, బహువచనమునో యొక్కదానినే యుంపవచ్చునుగాని పయిసమర్థనము ననుసరించి నేనట్లు మార్పుచేయలేదు.