పుట:Shodashakumaara-charitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

షోడశకుమారచరిత్రము


క.

కాయజవేదన కోర్వక
కాయము విడువం గడంగఁగా దైవగతిన్
నాయున్నయెడకు బుద్దిస
హాయుఁడు వచ్చుటయుఁ గాంచి హర్షం బెసఁగన్.

89


వ.

గాఢాలింగనం బొనరించి వృత్తాంతం బంతయు నెఱింగించినం జింతింపవలదు నీహృదయవల్లభ నీక సిద్ధించునుపాయంబు గలిగెడు నని యూఱడించి నీపడినయట్ల యేనునుం బడితి నాకథ విను మని యిట్లనియె.

90


గీ.

అట్లు వింధ్యాద్రి మిముఁ బాసి యరిగి యేను
బెక్కుగహనంబులు తరించి యొక్కయడవి
నిందిరామందిరం బయి యందమందు
శంఖపాలాఖ్య నొప్పారు సరసిపొంత.

91


క.

పలువురుబోటులతోడను
జలకేళి యొనర్ప వేడ్కఁ జనుదెంచిన యు
జ్జ్వలయౌవనైకవసతిని
విలసితరూపవతి నొక్కవెలఁదిం గంటిన్.

92


క.

అంగనకబరీమేఘము
నంగతటిద్ద్యుతియుఁ జూచి యనురాగముతో
నంగజుకేళిమయూరము
భంగిని సమ్మదవిఘూర్ణభావుఁడ నైతిన్.

93


క.

ఆకాంతయు న న్నచట వి
లోకనములఁ జూచుచుండె లోలాత్మక యై
యాకొలనివంక నొక్కమ
హాకరి యచ్చటికి వచ్చె నంభోవాంఛన్.

94