పుట:Sakalaneetisammatamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరివారలక్షణము. మంత్రాంగప్రకరణము, శత్రురాజులయెడ నుపాయపరికల్పము. యుద్ధాంగసమాహరణము, యుద్ధక్రమము కలసి యర్థశాస్త్రంబు సంక్షేపరూపంబు సెందె. నేఁటికాలమున నిందును గొన్నిభాగములు — ఆత్మరక్షణక్రమము, యుద్దాంగహరణము, యుద్ధక్రమము, మొదలగునవి పరిత్యజించి ప్రజాసంఘవిధానమును, ప్రజాధికారనిర్ణయమును, వార్తావర్ధకసంధివిగ్రహస్వరూపంబును, విజితరాష్ట్రపరిపాలనక్రమమును సర్వాధికారిబలనిర్ణయవిధానము నాదిగా విస్తరింపవలసియున్నది.

ఇప్పుడు లభించు నర్థశాస్త్రగ్రంథములలోఁ గౌటిలీయము శ్రేష్ఠ మైనది. దానిపై బౌద్ధభిక్షవు ప్రభావతియు, మానవమిశ్రయజ్వయు, శంకరాచార్యులును, భట్టస్వామియు రచించిన వ్యాఖ్యలు కొన్ని కొన్ని భాగములకే లభించుచున్నవి. భట్టస్వామివ్యాఖ్యకుఁ గేరళభాషానువాదము చాలభాగమునకుఁ గలదు. వీని నన్నిటిఁ గ్రోడీకరించి వ్యాఖ్యాసారముతోఁ గౌటిలీయమును దెనిఁగించుచున్నారము. అందుఁ దచ్ఛాస్త్ర సంబంధముగాఁ జాల లిఖింపఁదలఁచియున్నందున నిం దర్థశాస్త్రవిషయము విస్తరింప నలవి కాదు.

గ్రంథపరిశోధనము

మేము కొన్ని సంవత్సరములకుఁ బూర్వము నైజాము రాజ్యమున వనపర్తిసంస్థానమున నున్నకాలమున సమీపమున నుండు నమరచింత యను రాజాస్థానమునకుఁ గార్యాంతరమునఁ బోయియున్న కాలమునఁ దత్సంస్థానాధీశ్వరులగు శ్రీమంతు రాజాముక్కర సీతారామ భూపాల బహద్దరువారు మాయందు దయచేసి బద్దెన నీతిశాస్త్రముక్తావళియు సకలనీతిసమ్మతమును లిఖింపఁబడియుండు కాగితపుసంపుటమును ముద్రణార్థ మొసంగిరి. అప్పటికి నీతిశాస్త్రముక్తావళి మూలభాగము ముద్రింపఁబడియుండుటచేఁ బీఠికలో శ్రీమంతులవారి సహాయము నభినందించుచుఁ బాఠభేదములమాత్రము సూచించితిమి. సకలనీతిసమ్మతము లేఖకదోషసహస్రపరిపూరిత మగుటచే నాదర్శాంతరముకొఱకుఁ జిరకాలము ప్రతీక్షించియు లభింపమింజేసి తుద కున్నదాని సవరించి ప్రచురించుటయె మే లని తలంచియు మనోరథసహస్రమాత్రవిజృంభితుల మగు మాకుఁ గార్యసాఫల్యము గానరాక కొంతకాలము చెల్లిన నాంధ్రపత్రికాధీశ్వరులు బ్రహ్మశ్రీ శ్రీయుత కాశీనాథుని నాగేశ్వరరావు