పుట:Sakalaneetisammatamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాధీశుఁ డగురంతిదేవునిపై విషముక్రక్కునందియ విసరివైచి సవతిపై బగదీర్చుకొనియెనఁట. విదూరథరా జగు వృష్టిభార్య బిందుమతి మగని వాక్పారుష్యము సహింపఁజాలక జడలో శస్త్రిక దాఁచి యుంచి సురతాంతపరివశుఁడై విస్రంభముతో తనయురంబున వారిలియున్నతనిఁ జంపివైచెనఁట! ప్రాఁతకామందకమున "కెరలి శత్రులపయిఁ బ్రయోగింపవలయు" నని శత్రురాజులలో భేదము పుట్టింప దుష్టస్త్రీ విషకన్యాప్రయోగమును సమర్థించెను.

ఇట్లు సకలనీతిసమ్మతమునఁ గామందకపద్యముల నెల్ల మూలముతోఁ బరీక్షింపఁ దత్కవి వస్తువిచారము చక్కఁగాఁ జేసి వివరణప్రాయముగాఁ దెనిఁగించె నని తేలుచున్నది.

కవితారచనలో నీతిసార పురుషార్థసారములు చాలఁబ్రౌఢములైనవి. తరువాతఁ బంచతంత్రీ ముద్రామాత్య కామందకములను గ్రమముగాఁ జెప్పవచ్చును. పురుషార్థసారములో భావములు వక్రోక్తిచతురములై హృదయంగమము లగుచున్నవి. తుల్యప్రదేశములఁ బోల్చిచూడ నీప్రాచీనపద్యములకుఁ దరువాతికవుల పద్యరచన తీసిపోయి వస్తునిష్కృష్టియు, రసభావసమగ్రతము, నిమిడికయు ననుటలో న్యూనత్వము చెందుచున్నది.

అర్థశాస్త్రప్రశంస

నాలుగుపవేదములలో నొక్కటి యగునర్థవేదము మానవునియర్థసంపాదసరక్షణక్రమముల నుపదేశించును. అది యర్థసంపాదనమున సకలరసవాదధాతువాదక్రియలును, వార్త యనుపేరఁ బరఁగు కృషి, పాశుపాల్య, వాణిజ్యధర్మములును; అర్థరక్షణక్రమమున ధర్మన్యాయపరిపాలనంబును దండనీతియుఁ గలసి యర్థశాస్త్రం బనఁ బ్రఖ్యాతి గాంచె ఇట్టి శాస్త్రము లోకవ్యవహారవిద్యాసర్వస్వమును గ్రహించుటచే నం దేకదేశముగా రాజనీతి యనుపేర రాజ్యరక్షణక్రమము మాత్రము విశదీకరించునది యర్థశాస్త్ర మని బుధులు వ్యవహరింతురు. ఇందుఁ జాణక్యుని షట్సహస్రి యను కౌటిలీయార్థశాస్త్రము ప్రమాణగ్రంథముగాఁ బరిగణింపఁబడుచున్నది. దీనిలో ధర్మస్థీయ మను వ్యవహారకాండమును మను నారద పరాశర యాజ్ఞవల్క్యాదులు విస్తరించియున్నందున నదియు "రాజనీతినుండి తొలఁగింపఁబడి కేవలము రాజరక్షణము, దుర్గాదిస్థానవిధానము, మంత్రి