పుట:Ranganatha Ramayanamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గరమొప్ప సుందరకాండంబు నతుల - ధరఁ బర్వి లోకసుందర మయ్యెఁ గృతుల
నని యాంధ్రభాష భాషాధీశవిభుఁడు - వినుతకావ్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుఁ డపారధీశరధి - భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
తమతండ్రి విట్ఠలధరణీశుపేర - గమనీయగుణధైర్యకనకాద్రిపేర
బనిఁ బూని యరిగండభైరవుపేర - ఘనుపేర మీసరగండనిపేర
నాచంద్రతారార్క మై యొప్పు మిగిలి - భూచక్రమున నతిపూజ్యమై వెలయు1110
నసమానలలితశబ్దార్థసంగతుల - రసికమై చెలువొందు రామాయణంబు
పరఁగ నలంకారభావన ల్నిండఁ - గరమర్థి సుందరకాండంబు సెప్పె.
నారూఢి నార్షేయ మై యాదికావ్య - మై రసికానంద మై యెల్లనాఁడు
నివ్వసుమతి నొప్పు నీపుణ్యచరిత - మెవ్వరు చదివిన నెవ్వరు వినిన
సామాదిబహువేదచయధామరామ - నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్ ప్రభువిచారములు - పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు - ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
నాయురారోగ్యంబు లైశ్వర్యములును - పాయనిశుభములు పాపక్షయంబు
వరపుత్రలబ్ధియు వైరినాశనము - సరి నొప్పు ధనధాన్యచయసమృద్ధియును
ఏవిఘ్నములు లేక యిండ్లలో నధిక - లావణ్యవతు లైన లలనలపొందుఁ1120
గొడుకులతో నెప్డుఁ గూడి యుండుటయు - నెడగాగ నాపద లెల్లఁ బాయుటయు
సమ్మదంబున బంధుజనులఁ గూడుటయు - నిమ్ముల కామ్యంబు లెడపకుండుటయు
సతతంబు దేవతాసంతర్పణంబు - పితృగణతృప్తియుఁ బెంపారుచుండు
వ్రాసినవారికి వరశుభోన్నతులు - వాసవభోగాధివాసము గలుగు
నెందాఁక కులగిరు లెందాఁకఁ దార - లెందాఁక రవిచంద్రు లెందాఁక దిశలు
నెందాఁక వేదంబు లెందాఁక ధరణి - యెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక నీకథ యక్షరానంద - సందోహదోహళాచారమై పరఁగు.

సుందరకాండము సంపూర్ణము

————