పుట:Raadhika Santhvanamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. మంచిపామును బా ల్వోసి పెంచినట్లు
యింత దెలియని దాని నే సంతరింపఁ
దాను పెంచిన పొట్టేలు తఱిమి తఱిమి
సన్నబడు సామ్య మాయెనే చిన్నిచిలుక. 37

క. అడుకులు దిన్నం తాయెనె?
కడుపునఁ గు ట్టెత్తు నపుడు గానీ, తా నే
కడఁ జనునొ వంటయింటను
సుడివడు కుందేలు రేపె చూడుము చిలుకా. 38

గీ. పొల మెఱుంగని నిన్నటి [1]వళికె పడుచు
యింత సేసిన నేఁ జేయ నెంత కాను
వ్రేలు వాచిన [2]ఱోలంత పెరిఁగె ననిన
ఱోలు వాచిన నది యెంత పోలు చెపుమ. 39

వ. అని మఱియుఁ జిలుకతో నిట్లనియె. 40

గీ. ఈవు చెప్పిన మాట యొక్కింత యైన
జెవిని బెట్టక దాని నేఁ జేరఁ దీసి
మానిసిని జేసి నందుకు మగుడ నిఫుడె
ఫలము తోడ్తోడఁ గైవసం బాయెఁ గదవె. 41

గీ, తన్ను గట్టను దారంబు తానె కొనిన
జాడ నిటు దెచ్చి గోపాలుతోడఁ గూర్చి
చాలఁ జేసిన దీనికి మేలి మెల్ల
బూదిలోఁ జేయు హోమ మై పోయెఁ గదవె. 42

  1. వళికె = దీపము — బ్రౌ. మి. భా. ని. సందర్బము? Suggestion మొటికె
  2. ఱోలెంత వెలిఁగె ననిన – తా. ప. ప్ర. పాఠము