పుట:PadabhamdhaParijathamu.djvu/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కడు_____కడు 369 కడు_____కడు

కడుపులో చెయి పెట్టి కలచినట్లగు

  • విపరీత మయిన సంకటము కలుగు. విచారముతో వికారము కలిగిన దనుట.
  • "కడుపులో జెయి బెట్టి కలచినట్లైన." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1723.
  • "ఆమాట వినెసరికి నాకడుపులో చెయ్యి పెట్టి కలచిన ట్లయింది." వా.
  • చూ. కడుపులో చెయిపెట్టి తిప్పినట్లగు.

కడుపులో చెయిపెట్టి తిప్పినట్లగు

  • "బావురు మంటూ ఉన్న యీ యిల్లును చూచినప్పు డల్లా కడుపులో చెయి పెట్టి తిప్పినట్లు అవుతుంది." వా.

కడుపులో దేవిన ట్లగు

  • చూ. కడుపులో చెయి పెట్టి కలచినట్లగు.

కడుపులోపలి పుండు

  • పైకి కనిపించనిబాధ. తాళ్ల. సం. 11. 3 భా. 38.
  • చూ. పేగులోపలి తీట.

కడుపులో పెట్టుకొను

  • తప్పులను మన్నించు.
  • "ఏమీ ఎరగనిపిల్లవాడు. ఏం తప్పుచేసినా మీరు కడుపులో పెట్టుకొని కాపాడండి." వా.
  • "వా డేం చేసినా నేను కడుపులో పెట్టుకొంటూ వచ్చాను." వా.

కడుపులో ప్రేవు లరుచు

  • ఆక లగు.
  • "నా కడుపులో ప్రేవు లరుస్తున్నవి.కాస్త యేమైనా వడ్డించేది ఉందా? లేదా? వా.

కడుపులో మంట మండు

  • అసూయ కలుగు.
  • "దు, ఎమార్గుల కడుపులో మంట మండె." శతా. 115.

కడుపు వచ్చు

  • గర్భ మగు.
  • "ఆపిల్లకు చిన్నతనంలోనే మొగుడు పోయాడు. పాపం ! ఏం చేస్తుంది. ఎక్కడ ఎవడు మోసం చేశాడో యేమో ! కడుపు వచ్చింది. ఇప్పుడు నలుగురిలో తల యెత్తుకో లేక పోతున్నది." వా.

కడుపు సాగు

  • తిండి లేకుండు. కడుపు నిండా తిన్న ప్పుడు కడుపు ఉబ్బి పొడవు తక్కువవుతుంది. అది లేనప్పుడు పొడ వెక్కు వవుతుంది.
  • "అంతగా వాని కడుపు సాగిన దేమిటీ?" వా.

కడుపుసుత్తు

  • గర్భశోకము.
  • "కడుపు సుత్తు తెల్పగరాని గాసి వెట్ట." దేవీ. 9. 98.
  • చూ. గర్భశోకము.

కడుపూద

  • కడుపుబ్బు.
  • చూ. కడుపుబ్బు.