పుట:PadabhamdhaParijathamu.djvu/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంప____కంబీ 339 కంసా____కంసా

  • "డక్కిన విష్ణుభక్తియు దృఢంపు విరక్తియు గల్గు నమ్మరు,ద్భుక్కటకుం భజించుమతి పుట్టుక కంపల బడ్డ కాకి నై." పాండు. 2. 184.
  • చూ. కంపనబడ్డ కాకి అగు.

కంపవెట్టు

  • పాడు వెట్టు.
  • "పొంచి యెంతయు దోడ బుట్టిన దానిల్లు, కంప వెట్టినమహాఘనుండు వీడు." బిల్హ. 2. 65.
  • చూ. కంపగొట్టు.

కంబళపురీషము

  • నీచము; కంబళిమీది మలినము - ఒక తిట్టు. తొలగింపరాని దనుట. పట్టుకుంటే వదలని అహిత వస్తువు.
  • "మటుమాయలాడు కంబళ పురీషంబు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 4483.

కంబళికఱ్ఱ

  • ఒకరకం వంటచెఱకు.బ్రౌను.

కంబళిపురుగు

  • నీచుడు అన్న అర్థంలో దీనిని తిట్టుగా ఉపయోగిస్తారు. నల్లగా కంబళివలె ఉండు పురుగు. చెట్ల ఆకులపై ఉంటుంది.
  • "వాడు వట్టి కంబళి పురుగులా ఉన్నాడు." వా.

కంబీ తీయు

  • పాఱిపోవు. చిత్తూరుజిల్లాలో నేటికీ వినిపించే పలుకుబడి.
  • "అప్పు సంగతి యెత్తేసరికి వాడు కంబీ తీశాడు." వా.
  • చూ. కమ్మి తీయు.

కంసాలి ఉన్నచోట కథ చెప్పరాదు

  • యుక్తిశాలి ఉన్నచోట వట్టిమాటలు చెప్పుట కూడదు అనుపట్ల ఉపయోగించేది. కంసాలి యుక్తిశాలి అని ప్రతీతి.
  • ఇది ఒక కథపై యేర్పడినది. ఒకతను కథలు చెప్తున్నాడు. "ఒకచోట ఒక అరటి ఆకూ, మంటి పెళ్ళా స్నేహిత మయ్యాయి. అరటాకు అన్నది కదా 'వానవస్తే నేను నీమీద పడి రక్షిస్తాను. గాలి వస్తే నీవు నామీదపడి రక్షించు - అని." ఇలా అతను చెప్తుండగనే శ్రోతల్లో ఉన్న అతను అందుకొని రెండూ కలసి వస్తేనో అన్నా డట. అప్పుడా కథకు 'కంసాలి ఉన్నచోట కథ చెప్ప రాదు' అని వెళ్ళిపోయా డట!

కంసాలిప్రొవ్వులు

  • దిక్కు కొకరు మొగ మై విడి విడిగా ఉన్నా రనుట.