పుట:Neti-Kalapu-Kavitvam.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ర స్తు.

వాఙ్మయ పరిశిష్టభాష్యం

విస్తరాధికరణం

ఇది గుణదోష విచారనచేస్తాను.

ఈ కాలపు కృతుల్లో ముఖ్యంగా నాటకాల్లో ఈవిస్తరదోషం కనబడుతున్నది. చెప్పవలసినదానికంటె హెచ్చుగా కవిగాని పాత్రలు గాని చెప్పడం విస్తరదోషం. దీనివల్ల విసుగు రసభంగం కలుగుతున్నవి. లోకంలో సయితం వదరుబోతును అధికప్రసంగంచేస్తాడని అసహ్యించుకొంటాము. ఇక రసాస్వాదం కలగవలసిన నాటకంలో అధిక ప్రసంగం అసహ్యమని చెప్పవలసిన పనిలేదు. నాటకంప్రయోగ ప్రధానం రంగస్థలంలో పాత్రలు ఊరికెవదురుతుంటే లేచిపోవలెనని మనకు బుద్ధిపుట్టుతుంది. వకీళ్లు విద్యాంసులు తమసిద్ధాంతాలను స్థాపించడానికి హెచ్చుగా మాట్లాడినా తగేవుంటుందిగాని రసాస్వాద ప్రధానమైన కావ్యనాటకాల్లో ఆపని చాలాహేయం. ఈ హేయమైనపని యీ కాలపు కావ్యాల్లో నాటకాల్లో తరుచుగా కనబడుతున్నది. కూచి నరసింహకృతి వనవాసిలో సేవకుడు యజమానుడి అపాత్రదానాన్ని గురించి రెండుపుటలు ప్రసంగిస్తాడు. సప్తమాంకంలో పావకుడు దారకుణ్ని దూషించడానికి మధ్య ఒక దారకవాక్యం తీసివేస్తే వరసగా మూడుపుటలు ప్రసంగిస్తాడు. బళ్లారి కృష్ణమాచార్యుల సారంగధర చిత్రనళీయాదులు విస్తరదోషంతోకూడి వున్నవి. చిత్రనళీయంలో ప్రథమాంకం తృతీయరంగంలో నటుడు భీమపుర వర్ణనగురించి హరిణగతిరగడలో పూర్తిగా రెండుపుటలుపన్యసిస్తాడు. అడవిలో దమయంతి నిద్రబొయ్యేటప్పుడు ఈమె నెట్లా వదులుతానని రెండుపుటలు గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతాడు. దమయంతి లేచి రెండుపుటలు విలపిస్తుంది. ఇట్లానే రామరాజుతో పఠానుచివరన కొన్నిపుటల ఉపన్యాసం చేస్తాడు. సారంగధర మొదలైన విట్లానేవున్నవి. ఇట్లాటివి