పుట:Navanadhacharitra.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

నవనాథచరిత్ర

మలయుచు నటియించె ◆ మద మయూరములు
చెలఁగెను జన వన ◆ స్థితిఁ జాతకములు
తత్సమయమున కం ◆ దారాధినాథుఁ
డుత్సాహి యైవెర ◆ వొప్పగాలువలఁ
గట్టగాఁ జేయించి ◆ కడఁక నమ్మడువు
పట్టుకు నీరు రాఁ ◆ బరుపఁగానవియు
మొదలి శుద్ధోదకం ◆ బులు దిగంబడిన
విదితరసాతల ◆ వివరంబునందు
వడియె నానీరు ని ◆ ల్వకపోయె నంత
పుడిసెఁడులేక య ◆ ద్భుతముగా నింకె
నప్పుడా జనపాలుఁ ◆ డంతరంగమునఁ
గప్పిన వగల న ◆ క్కటకట నాకుఁ
బాపంబు నిందయుఁ ◆ బ్రాపించె దీనిఁ
బాపుకొనంగ ను ◆ పాయ మేదియును
బొడగాననైతిఁ దెం ◆ పున శరీరంబు
విడిచెద నింకని ◆ వెడవెడఁ గూర్క
వడి నుదకాధిదే ◆ వత గలలోనఁ
బొడసూపి తాఁ జెప్పి ◆ భూవర నాకు
బలిగాను శూద్రులఁ ◆ బదివేలనొండె
వలనొప్ప వేవుర ◆ వైశ్యుల నొండె
నుతికెక్కు రాజుల ◆ నూర్వురనొండె
ధృతిమీఱఁ బదుర భూ ◆ దివిజులనొండె
నొకసిద్ధపుంగవు ◆ నొండె నొప్పింపు
ప్రకటమై నిలుచుఁ బూ ◆ ర్వప్రకారమున
సిద్ధజలం బని ◆ చెప్పి పోవుటయు
నద్ధరావరుఁడు స ◆ య్యన మేలుకాంచి
యరుణోదయంబైన ◆ నాచారవిధులఁ
బరిపాటిఁ దీర్చి గొ ◆ బ్బునఁ గొల్వునకును
జను దెంచి తనకల ◆ చందంబు సచివ
జనుల కెఱింగించి ◆ చనుచు లోపలికి
వారిఁ జేయుండన ◆ వారు నావార్త
వారక యాబలి ◆ వశమునఁ జెఱువు
నెసఁగు టెంతయు నిజం ◆ బను మాట కల్ల