పుట:Navanadhacharitra.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

269

ననుచితక్రియలచే ◆ నందునే ఫలము
పనిలేని సడియుఁ బా ◆ పముఁ గట్టుకొంటి
నలసి తెంతయు నిందు ◆ నధికారు లెల్ల
సొలసిరి త్రోవయుఁ ◆ జొప్పడదయ్యె
నని వితర్కించి గు ◆ ప్తాకారలీల
ననుదినంబును బట్ట ◆ ణాభ్యంతరంబు
గలయఁజరించి యె ◆ క్కడ నెవ్వరైన
బలువిడిఁగూడి సం ◆ భాషించువారు
గలిగిన నటువంటి ◆ కడలకు నరిగి
నెలమి వారలవంక ◆ నేవి శేషములు
వినఁబడునో యని ◆ వేడ్క నాలించు
ఘనులైనవారలఁ ◆ గదిసి భాషించుఁ
బరువడిదేవతా ◆ భవనస్థులైన
పర దేశ వాసుల ◆ భావంబు లరయు
నీరీతి మెలఁగెడు ◆ నెఱి నొక్కనాఁడు
గోరంటకుం డను ◆ గోరక్షశిష్య
వరుఁ డొక్క రుఁడును భూ ◆ వలయంబు గలయఁ
దిరుగుచు ముదము సం ◆ ధిల్లఁ దత్పురికి
నేతెంచి మున్ను మ ◆ త్స్యేంద్రుఁ డీపొంత
నాతత ప్రియకరం ◆ బగు నొక్క మడువు
కెలన దుగ్ధము లార ◆ గించి యాచమన
మెలమిఁ గావించి తా ◆ నేఁగె నిందుండి
యవి సిద్ధసలిలంబు ◆ లయ్యె నానీరు
చవిగొన్న వారలు ◆ [1]చావుఁగరంబు
నడఁచి యాయుష్మంతు ◆ లగుదు రా మడువు
కడకేగి చూతము ◆ గాని రమ్మనుచు
తన శిష్యుఁ దోఁకొని ◆ తత్పదంబునకుఁ
జని కుంభ భవపీత ◆ సలిలమై బయలు
[2]వడియున్న మున్నీటి ◆ బయలు చందమునఁ
గడు శూన్యమగు మహా ◆ గర్తంబు గాంచి
యచ్చెరువునుబొంది ◆ యా తెఱంగెల్ల
నచ్చటి జనముల ◆ నడి గది యెఱిఁగి

  1. జాలనికరంబు.
  2. బయలున్న.