పుట:Navanadhacharitra.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

నవనాథచరిత్ర

కర్మంబునకు గతి ◆ గావింపుఁ డనిన
ధర్మశాస్త్రముఁ జూచి ◆ ధరణీశు కనిరి
మొదల వీనికిఁ గల ◆ మొల్ల మంతయును
వదలక కొనిపోయి ◆ వడి నడురేయి
విఱిచి కట్టుక పోయి ◆ విపినంబులోన
నఱకఁ బంపుము చర ◆ ణములఁ జేతులను
అనిన మీ రటు సేయుఁ ◆ డని తలవరులఁ
గనుఁగొని సెల విచ్చి ◆ కాంతఁ గూపమున
నూకించి పిదపఁ దా ◆ నును గొల్వు విడిచె
నాకమలాప్తుండు ◆ నపరాబ్ధిఁ గ్రుంకె
నత్తఱిఁ దలవరు ◆ లామంత్రిముఖ్యు
నొత్తిబంధించి మ ◆ హోగ్రతం బొంది
తనయులు నాలును ◆ దల్లి బంధువులు
జనులును ఘనశోక ◆ జలధిలో మునుఁగ
నాపూతవర్తను ◆ నపరాధహీను
వాపోవ నా ఘోర ◆ వనభూమిలోనఁ
గడఁగి చేతులుఁ గాళ్లు ◆ గనెలుగాఁ గోసి
విడిచిన నడలుచు ◆ విశ్వేశ! గిరిజ!
నగరాజ కోదండ! ◆ నన్న కారణము
పగగొని కృపమాలి ◆ పట్టి కోయింప
నీ కపటోపాయ ◆ మెవ్వఁడు వన్నె
[1]నాకుటిలాత్ము న ◆ ట్టడవిలో నిట్లు
గోఁతలఁబడి గోడు ◆ కుడువని మ్మనుచు
నాతీవ్రవేదనఁ ◆ బ్రాణముల్ విడిచె
నా జయంతుఁడ వీవు ◆ నాసుమంతుండు
రాజమహేంద్ర భూ ◆ రమణుఁ డీరీతి
నేకాలమున నెవ్వఁ ◆ డేది గావించు
నాకాలమున వారి ◆ కటు కాక పోదు
కావునఁ దొల్లి దు ◆ ష్కర్మంబుక తన
నీవిధి పాటిల్లె ◆ నింతియె కాని
యీజన్మమందు నీ ◆ యెడఁ గల్లలేదు
రాజనందన మేలు ◆ రాఁగల దింక

  1. కులాత్మకుడు.