పుట:Mana-Jeevithalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హృదయ నిరాడంబరత

37

చేసే కళను అభ్యసిస్తారు. అడవుల్లోకి గాని, మఠంలోకి గాని, ఏదైనా చీకటి గదిలోకి గాని వెళ్లిపోతారు ధ్యానం చేసుకోవటానికి. పైకి మాత్రం మీ జీవితాన్ని నిరాడంబరంగా చేసుకుంటారు. ఇలా జాగ్రత్తగా ఆలోచించి తయారు చేసుకున్న పథకం ప్రకారం ఈ లౌకిక ప్రపంచానికి అతీతమైన సౌఖ్యాన్ని పొందాలని ఆశిస్తారు.

కాని, వాస్తవికతని బాహ్యనిగ్రహాల ద్వారా, ఆంక్షల ద్వారా చేరుకోగలరా? బాహ్యనిరాడంబరత, సుఖాల్ని వదులుకోవటం అవసరమే అయినా, ఆ మాత్రం చేష్టకే యథార్థం అనేదానికున్న ద్వారం తెరుచుకుంటుందా? సౌఖ్యంతో, విజయంతో, మనస్సు, హృదయం భారమైపోతాయి. ప్రయాణం చెయ్యాలంటే స్వేచ్ఛగా ఉండాలి. అయితే, మనం ఈ బాహ్యచేష్టతోనే ఎందుకంత సతమతమైపోతున్నాం? మన ఉద్దేశాన్ని బాహ్య రూపంలో పెట్టటానికి ఎందుకంత ఉత్సుకత, ఎందుకంత పట్టుదల? ఇది ఆత్మవంచన వల్ల కలిగే భయం వల్లనా, మరొక కారణం వల్లనా? మన చిత్తశుద్ది గురించి మనల్ని మనమే నమ్మించుకోవాలని ఎందుకు కోరుకుంటాం? సుస్థిరంగా ఉండాలనే కోరికలోనూ, ఏదో అయితే మనకి ఘనత ఉంటుందన్న నమ్మకంలోనూ ఈ సమస్యంతా ఇమిడి ఉంది.

ఏదో అవాలనే కోరికతోనే చిక్కులన్నీ ఆరంభమవుతాయి. ఏదో అవాలి అనే కోరిక లోపలా, బయటా కూడా అంతకంతకు పెరిగిపోవటం వల్ల కూడబెట్టు కోవటం, త్యజించటం, అలవరచుకోవటం, లేదా వదులుకోవటం చేస్తూ ఉంటాం. కాలం అన్నింటినీ దోచేస్తుందని తెలిసి కాలరహితమైన దానికోసం ప్రాకులాడతాం. ఏదో అవాలని చేసే ఈ పోరాటం - ఏదైనా చెయ్యటం ద్వారా గాని, మానెయ్యటం ద్వారా గాని, బంధనాలను పెంచుకోవటం ద్వారా గాని వాటిని వదులుకోవడం ద్వారా గాని, బాహ్యచేష్టలతో గాని, క్రమశిక్షణతోగాని, సాధనతో గాని ఎన్నటికీ అంతం కాలేదు. కాని, ఈ పోరాటాన్ని అవగాహన చేసుకోవటంతోనే, ఏ విధమైన, బాహ్య ప్రేరణా లేకుండా దానంతట అదిగా స్వేచ్ఛ కలుగుతుంది. బహిరంగంగానూ, ఆంతరంగికంగానూ జరిగే సేకరణ నుంచీ, అది కలిగించే సంఘర్షణల నుంచీ విముక్తి లభిస్తుంది. కేవలం బంధనాలను తెంచుకోవటం ద్వారా వాస్తవికతని