పుట:Mana-Jeevithalu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

దేనితోనైనా ఎలా వ్యవహరించాలో తెలియనప్పుడే ప్రతిఘటన ఉంటుంది. మోటారు ఎలా పని చేస్తుందో మీకు తెలిస్తే మీరు స్వేచ్ఛగా ఉంటారు. ఏదైనా చెడిపోతే దాన్ని బాగుచేసుకోగలరు. మనకి అర్థంకాని దాన్నే ప్రతిఘటిస్తూ ఉంటాం. గందరగోళాన్నీ, పాపాన్నీ, దుఃఖాన్నీ ప్రతిఘటిస్తాం - దాని నిర్మాణం తెలియనప్పుడు, అదెలా రూపొందిందో తెలియనప్పుడు. గందరగోళం నిర్మాణం ఎలాంటిదో, ఎలా ఏర్పడిందో మీరు తెలుసుకోలేదు కాబట్టి మీరు ప్రతిఘటిస్తున్నారు. మీరు దాన్ని ఎందుకు తెలుసుకోలేదు?

"నేనెప్పుడూ ఆవిధంగా ఆలోచించలేదు."

గందరగోళం నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం మీకు ఉన్నప్పుడే అది పనిచేసే పద్ధతిని మీరు తెలుసుకోగలుగుతారు. ఇద్దరి మనుషుల మధ్య సంపర్కం ఉన్నప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకరి నొకరు ప్రతిఘటిస్తూంటే అవగాహన కలగదు. భయం లేనప్పుడే సంపర్కంగాని సంబంధం గాని ఉంటుంది.

"మీ ఉద్దేశం గ్రహించాను."

అయితే మీరు దేన్నుంచి భయపడుతున్నారు?

"భయం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో?"

భయం సంబంధంలోనే ఉంటుంది. భయం దానంతట అది విడిగా ఉండదు. నిష్కారణమైన భయం అంటూ ఏదీ ఉండదు. తెలిసిన దాన్ని గురించో, తెలియని దాన్ని గురించో, ఒకరు చేసిన దాన్ని గురించో, చెయ్యబోయే దాన్ని గురించో భయం ఉంటుంది. గతం గురించిగాని, భవిష్యత్తు గురించి గాని భయం ఉంటుంది. తాము ఉన్న స్థితికీ, ఉండదలుచుకున్న స్థితికీ మధ్యనున్న సంబంధం భయాన్ని కల్పిస్తుంది. తాము ఉన్న యథార్థస్థితిని బహుమాన రూపంలోగాని, శిక్షరూపంలో గాని అనువదించి చెబితే భయం పుడుతుంది. బాధ, సంతోషం - వీటి మధ్య నున్న వ్యత్యాసం వల్ల భయం ఉంటుంది. పరస్పర వ్యతిరేకమైన వాటి మధ్య సంఘర్షణలో భయం ఉంటుంది. విజయాన్ని ఆరాధిస్తే, అపజయం అంటే భయం వేస్తుంది. ఏదో అవాలనే పోరాటంలో జరిగే మానసిక ప్రక్రియ భయం