పుట:Maharshula-Charitralu.firstpart.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

27

పరశురాముఁ డొకప్పు డగస్త్యమహర్షిని దర్శించి యాతనిచేఁ గృష్ణామృత స్తోత్రమును విని కృష్ణకవచధరుఁడై యిరువదియొక్క మాఱు రాజులఁ జంపెను.

అగస్త్యుఁడు భూభారము తగ్గించుట

తొల్లి హిమగిరిపైఁ బార్వతీపరమేశ్వరుల వివాహము జరుగుచుండఁగా నా కల్యాణమును జూచుటకు యక్ష కిన్నర సిద్ద కింపురుషులు నెల్లరు వచ్చి బ్రహ్మానంద సముద్రమున నోలలాడుచుండిరి. అప్పుడు భూదేవి దక్షిణదిక్కునఁ బైకి లేచుటయు నుత్తరదిశను లోనికిఁ గ్రుంగిపోవుటయు సంభవించెను. అందఱును భయపడసాగిరి. అంతఁ బరమేశ్వరుఁ డగస్త్యమహర్షి ని బిల్చి "కుంభ సంభవా! ఈ యుపద్రవమునుండి కాపాడుటకు నీవు దక్క నన్యు లెవ్వరును గానవచ్చుట లేదు. కావున నీవు సశిష్యుఁడవై దక్షిణదిక్కునకుఁ బొమ్ము. అంత భూమి సమమగును. అచటనుండియే నీవును నీ శిష్యులును నా కల్యాణ మహోత్సవము చూడఁగలశక్తి. యనుగ్రహించితిని ఆలసింపక పొ"మ్మనెను. అంత నగస్త్యమహర్షి శివు నానతిని లోపాముద్రాపరిపూర్ణ పార్శ్వుడై శిష్యసమేతముగా దక్షిణమునకుఁ బోయెను. అంత భూదేవి భారము తగ్గుటచే యథాపూర్వముగ సమవర్తిని యాయెను. అగస్త్యమహర్షి యట్లు సర్వేశ్వర కటాక్షముఁ బడసి సశిష్యుఁడై లోపాముద్రతో నట నుండియే దివ్య చక్షువులచేఁ బార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవమును గాంచి యానందాంబుధి నోలలాడెను.[1]

ఆగస్త్యుఁ డింద్రద్యుమ్నుని శపించుట

పూర్వ మొకప్పుడు ద్రవిళాధీశుఁ డగు నింద్రద్యుమ్నుఁడు వైష్ణవోత్తముఁడై సర్వాత్ముఁ డగు నారాయణు నారాధించుచు నొక

  1. శివపురాణము