పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసిద్ధికెక్కిన కుటుంబము. తండ్రికొడుకు లిరువురును ఆకాలమున మంచి వ్యవహర్తలని పేరుగాంచిరి. కోటయ్యగారు కరిణీకము చేయవచ్చునప్పటికి లింగముగుంటగ్రామమునకును చుట్టుప్రక్కల హద్దులులేవు. కాబట్టి పొలిమేరత్రొక్కుటకు కోటయ్యగారినే గవర్నమెంటు ఉద్యోగులును గ్రామములోని ప్రజలును కోరిరి. పొలిమేరత్రొక్కుటకు సామాన్యముగ నందరును ఒప్పుకొనరు. ఏయూరి అసామీలు చేసుకొన్న పొలములు ఆయూరి వారికే యుండులాగున జ్ఞాపకముపెట్టుకొని న్యాయదృష్టితో జాగ్రత్తగా చేయవలసిన కార్య మది. అట్లు హద్దులుత్రొక్కుటలో అక్రమము జరిగినయెడల ఆ త్రొక్కినవారివంశము నాశనమగు ననువిశ్వాసము గూడ ప్రజలలో వ్యాపించియుండెను. ప్రజలు కోటయ్యగారుతప్ప మరియొకరు సమర్థులుగారని పట్టుపట్టుటచేత సమ్మతించెను. పూర్వాచారప్రకారము ఆనాడు చెరువులో స్నానముచేసి, తడిగుడ్డలతోనే రామాయణము నెత్తిన బెట్టుకొని అనేకజనులు వెనుక నడచుచుండగా లింగమగుంటపొలములచుట్టును ప్రదక్షిణముగ తిరిగివచ్చెనట. అప్పుడొక నల్లనికుక్క ఆయనకు ముందు నడిచెననియు, ఆకుక్క నడిచిన త్రోవనే ఆయన నడిచెననియు చెప్పిరి. ఆప్రకారము చుట్టివచ్చిన త్రోవయే లింగమగుంటగ్రామమునకు పొలిమేరగా నేర్పడినది. ఆనాడు ఆయన యుపవాసముచేసి దీక్షతో నుండెను. వారియింటిలో ఏ చిన్నప్రాణి గతించినను ఆయన పొలిమేర త్రొక్కుటలో అన్యాయముచేసినట్లు ప్రజ లూహింతురుగాన కొన్నాళ్ళవరకు ఇంటిలో పశువులు, పిల్లి, కుక్క మొదలగు వానిని జాగ్రత్తగా కాపాడుచుండిరట.