పుట:Kashi-Majili-Kathalu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

67

అప్పుడు నాఁకు బ్రాణములు పోయినట్లేయైనవి. ప్రయత్నముతో నడచుచున్నను నిమ్నోన్నతముల నరయలేక అడుగులు తడఁబడుచుండ నెవ్వఁడో బలాత్కారముగాఁ దీసికొని పోవునట్లెట్ట కేల కాప్రదేశముజేరి మణిశిలాతలంబున వనకుసుమములచే విరచింపఁబడి యున్న శయ్యయందు దీఘ౬నిద్రా ముద్రిత నయనుండై చందన రస చర్చితమగు నవయవముల మృణాళనాళముల నలంకారములుగా ధరియించి మన్మధవ్యధ సహింపజాలక నిశ్చేతనుండై సుఖించుచున్నట్లు అపూర్వప్రాణాయోగం బభ్యసించుచున్నట్లు అనంగయోగ విద్య నవధరించుచున్నట్లు విగతజీవితుండయినను దేజంబుదప్పక పడియున్న పుండరీకుని మహాపాపాత్మురాలనగు నేఁను జూచితిని.

కపింజలుఁడు నన్నుఁజూచి రెట్టించిన శోకముతో నతని కంఠమును గౌఁగలించుకొని మఱియు నెక్కుడుగా విలపింపఁదొడంగెను. అప్పుడు నేను మూర్ఛాంధకార వివశనగుట నేమని విలపించితినో యేమయితినో యెఱుంగను. నామేనినుండి ప్రాణములు సైత మేమిటికిఁ బోయినవికావో నాకుఁదెలియదు. మఱికొంతసేపటికి నాకుఁ దెలివివచ్చినది. అప్పుడు నాదేహమును నగ్నియందుబడినట్లు అసహ్యశోకదహ్యమానమై నేలంబడి కొట్టుకొనుచుండఁ జూచితిని.

హా! యిదియేమి యుపద్రవము, ఇట్లు వచ్చినదని పెద్దయెలుంగున హా! అంబ! హా! తాత! హా! సఖులారా! యనియరచుచు, హా! నాధ! జీవితనిబంధన! నన్నొంటిమైవిడిచి యెక్కడికిఁ బోయితివో చెప్పుము, నీనిమిత్త మెట్టియవస్థ ననుభవించితినో తరళికనడుగుము. దివసమొక్కటియే సహస్రయుగ ప్రాయముగా గడిపితిని.

ఒక్కసారి మాటుడుము? భక్తవత్సలత్వము జూపుము. నా మనోరధము పూరింపుము. భక్తురాల, ననురక్త, బాల, ననాధ, మదనపరిభూత, నిట్టి నాయందేటికి దయసేయవు? నేనేమి యపరాధము