పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూర్తి జెన్నీని చూచి "ప్రియా సంపూర్ణ స్వరాజ్యం రానీ హిమాలయాలనే అఖండ శక్తిని మేము మన దేశానికి వరమిచ్చేటట్లు చేయగలం. ఆ పర్వతాలలో యెన్నివేల లోయలు, ఎన్ని మహానదులు! అన్నీ ఆనకట్టలు కట్టి హిందూదేశం ఏమిటి సర్వ ఆసియాకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయగలం. రాజపుత్రపు టెడారిని మహోద్యానవనం చేస్తాము.” అని పలికినాడు. జెన్నీ భర్త మోము చూచి అందు వెలిగిపోయే కాంతులు చూచి ఆనంద చకితయైనది.

అలా వారు గంటలకొలదీ మాట్లాడుకొనేవారు.

ఆనాటి కానాడు జెన్నీ భర్త ప్రేమ క్షీరవారాశిలో వటపత్ర శయని అయి ఆనందతరంగ డోలికాలోల పరవశమై పోతున్నది. ఆమె మూర్తిని హిందూ బాలికలవలె పూజింపసాగింది. ఆమె అద్భుతాలైన ఖద్దరు పట్టుచీరలు కొనుక్కొని కట్టడం నేర్చుకుంది. బెంగుళూరి పట్టురవికలు, భారతీయ భూషణాలూ అలంకరించు కొనసాగింది. ఆ నూత్న మనోహరి వేషం చూస్తూ మూర్తి పరవశుడై పోయినాడు.

మూర్తి పని జూన్ నెలాఖరుకు మూడుపాళ్ళు పూర్తి అయిపోయింది. జలాశయం, జలసూత్రాలు, గొట్టాలు, కొండపని అంతా పూర్తి అయినాయి.

వానలు ప్రారంభించాయి. పని అంతవరకూ బాగా ఉందని సంతోషిస్తూ, మూర్తి ఇంటికి వచ్చేసరికి, జెన్నీ ఇంటికి రాలేదు. మూర్తి స్నానంచేసి సావిడిలో పడకకుర్చీలో కూర్చుండి పైపు కాలుస్తూ, పగటి కలలు కంటున్నాడు. కాలం ఎంత జరిగిందో అతనికి తెలియదు. చటుక్కున జెన్నీ కలకలలాడుతూ లోననుండి నెమ్మదిగా నడిచి వచ్చి భర్త కన్నులు మూసింది. అతడులిక్కిపడి “దొంగా! నా సామ్రాజ్ఞివి నువ్వు! తెలుసుకున్నానులే!” అన్నాడు.

ఆమె చేతులు తీసి, అతని వైపు నోటనుండి తీసి బల్లమీద పెట్టి అతని ఒళ్ళో కూర్చుని అతని మెడచుట్టూ చేయి వైచి, అతని చెవిదగ్గర నోరుంచి “ఓ నా నరుడా! నువ్వు తండ్రివి కాబోతున్నావు!” అని చెప్పి, అతని కన్నులు మూసింది.

“ఆఁ!” అంటూ మూర్తి భార్యను గట్టిగా హృదయానికి అదుముకొని, “నా దేవీ! కుళ్ళు నీళ్ళలో పొర్లాడే ఈ పశువును ఐరావతాన్ని చేశావు. నాకు నా ఆత్మలో నీ ఆత్మ కలిపి ఒక దివ్య వరం ప్రసాదించావా?” అని ఆమె పెదవులు చుంబించినాడు.

ఓం అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

90

నరుడు(సాంఘిక నవల)