పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందం చూచి ఆమె నాకు అమ్మమ్మ అంత పెద్దదీ అవటంవల్ల ఒక తెల్లని బాలికను నా స్వప్న ప్రపంచంలో నాకై సృష్టించుకొన్నాను. ఆనాటి ఆమె రూపు, సౌందర్యము, విలాసము నీలో మూర్తీభవించాయి.

ఆ బాలిక నిశ్శబ్దంగా మూర్తిని కౌగలించుకొని, “నా నాయకా! నేను అదృష్టవంతురాలనో నువ్వే అదృష్టవంతుడవో నిర్ణయించేది, ఆ అదృష్టదేవతే!” అని అతని పెదవులు తమిగా చుంబించింది.

8

మూర్తి మరునాడు ఆఫీసులో కూర్చుండి పనిచూసుకుంటున్నాడు.

నదులకు ఆనకట్టలు, తీరాల ఎత్తయినగట్టులు, ఆనకట్టలవల్ల పెద్దచెరువులు, చెరువుల క్రింద కాలువలు. నీరు మహావేగంతో బ్రహ్మరాక్షసియై చక్రాలను తిప్పడం, దానివల్ల డైనమోలు తిరగడం విద్యుచ్ఛక్తి ఉద్భవించడం, ఆ శక్తి దేశం అంతటా తీగెలతో సరఫరా చేయడం, ఆ శక్తివల్ల, మిట్ట ప్రదేశాల నూతులలోనుండి నీరు పైకి రావడం గ్రామాల పిండిమరలు, ప్రతి పూరిల్లులో వెలుగు, పల్లెటూళ్ళలో చిన్న చిన్న రోడ్ల పొడుగునా పెద్ద రాజ బాటలలో దీపాలు, గ్రామాల రేడియోలు, సినిమాశాలలు, చిన్న చిన్న యంత్రసహాయంవల్ల గ్రామ పరిశ్రమ, అందరికీ తిండి, అందరికీ బట్ట, అందరూ ఒకేజాతి, అందరూ ఒకే ఆనందం! ఆ స్వప్నంలో ఉండగా “సాబ్! ఒక సాహెబ్ (తెల్లాయన) ఈ కార్డు ఇచ్చినారు” అని చప్రాసీ మూర్తి బల్లమీద ఒక కార్డు పెట్టినాడు. “మేజరు కార్లయిల్, 3వ ఇండియను రైఫిల్సు, పెషావరు.” అని ఉంది.

ఎవరా అని ఒకే ఒక్క నిమేషం ఆలోచించాడు. ఆ వెంటనే మెరుపులా జ్ఞాపకం వచ్చింది. జెన్నీ పెద్ద అన్నగారు! వెంటనే లేచి అతిథులు కూర్చునే గదిలోకి బోయి “నేను మూర్తినండీ! లోనికి దయచేయండి” అని పిలిచాడు.

మేజరు కార్లయిల్ సంపూర్ణ మిలటరీ దుస్తులలో ఉన్నాడు. చేతనొక బెత్తం వుంది. మేజరు కార్లయిల్ తండ్రి పోలిక. అతని ఒతైన మీసాలు చివర సన్నంగా మొన వచ్చేటట్టు మెలిబెట్టి వున్నాయి.

మూర్తి చేయి అందిచ్చినా అతను చేయి చాచలేదు. తాను “మూర్తి”నని చెప్పుకున్నా అతడు తాను మేజరు కార్లయిల్ అని చెప్పుకోలేదు. అతడు కుర్చీమీద నుండి లేవలేదు.

మూర్తి ఆశ్చర్యమందాడు.

మేజరు కార్లయిల్ కూర్చుండే, “ఓరీ బ్లడీ నిగ్గర్ ఏదిరా మా చెల్లెలు? ఎక్కడ ఉందిరా? నీ తోలు ఊడేటట్లు ఈ బెత్తంతో నీ వీపు” - అని, పండ్లు బిగించి మాట్లాడాడు.

“మా చెల్లెల్ని కలుసుకునేందుకు ప్రయత్నించినా, మా చెల్లెలికి ఉత్తరాలు రాయడానికి ప్రయత్నించినా, నా ఉద్యోగం సంగతీ, నీ ఉద్యోగం సంగతీ ఆలోచించకుండా పదిమందిలో పట్టుకు నీ వీపు చితకగోట్టడం తథ్యం!” అని లేచి మేజరు కార్లయెల్ విసవిస నడిచి వెళ్ళిపోయాడు.

ఎల్లమందమూర్తికి కలిగిన ఆశ్చర్యం వర్ణనాతీతము. కోపం, ఉక్రోషం, విచారం, భయం, దుఃఖం, ఒకదాని వెంట ఒకటి తరుముకు వచ్చాయి. అలాగే నిరుత్తరుడై

అడివి బాపిరాజు రచనలు - 7

65

నరుడు(సాంఘిక నవల)