పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అదేమిటండీ రివాల్వరు పెట్టుకొని కత్తి యుద్దాలూ, ముష్టి యుద్ధాలూ చేస్తారు. పైగా ఆ వేషాలేమిటి? లాగులు, కోట్లు - ఆ డ్రెస్సులు గవర్నరుగారి కోచీలుతోలే ప్యూనుల వేషాలు, ఆ డ్యాన్సు లేమిటి. ఆ పాటలేమిటి? ఛా ఛా! భాషలో కూడా స్త్రీ పురుషుల సంబంధాలు అర్థమిచ్చే మాటలూ, పాటలూ రామచంద్రా మా కులం వాళ్ళ తిట్లు కూడా అంత ఛండాలంగా ఉండవు!"

“టెలిగ్రాం సార్!” అని వీధిలోనుండి కేక వినబడింది.

బుచ్చి వెంకట్రావు, రాధాకృష్ణా వెంకట్రావు మేడమీద పద్మావతి కాశీ ప్రయాణం చేసే రోజున సాయంకాలం నాలుగు గంటలకు సినిమా విషయాలు చర్చించుకునేందుకు కలుసుకొన్నారు. అప్పుడే ఈ తంతివార్త వచ్చింది. అది రాధాకృష్ణ అందుకొని, కాగితం తీసి, మడత విప్పి చదివినాడు. "పద్మావతి... పరీక్ష...కోసం ... కాశీ... వెడుతున్నది... నిన్ననే.. రామేశ్వరం... నుండి రాక... నేను కూడా వెడుతున్నాను... నిన్ను... చూడాలని... ఆదుర్గాపడుతున్నది... అక్కడ... చూడటం... వీలు... లేకపోయింది... వెంటనే... విమానంలో... బయలుదేరి... ఢిల్లీలో... కలుసుకో... నరసింహమూర్తి అని ఉంది. “తంతి గూడూరు రైల్వే స్టేషనునుండి ఇచ్చినట్లున్నది వెంకట్రావుగారూ!”

“మీరు వెంటనే బయలుదేరి వెళ్ళడం మంచిది!” అని రాధాకృష్ణ అన్నాడు.

“ఎక్కడికి?"

"ఢిల్లీ."

“ఇప్పుడు వెళ్ళమంటారా.”

“ఆ. ఢిల్లీలో కలుసుకొనే మీరు ఒకటి రెండు రోజులు అమ్మాయితో ఉండి వెంటనే రావచ్చును. కాశీవరకూ వెళ్ళి దిగబెట్టిరండి!”

“ఇదో దండగా?”

రాధాకృష్ణ మాటాడలేదు. పదినిమిషాలాగి. “నేను ఇంటికి వెడతాను ఇంటిదగ్గిరే ఉంటాను, మీరు వెళ్ళదలచుకొన్నదీ లేనిదీ. నాకు 'ఫోను' చెయ్యండి!”

“సరేలెండి!”

రాధాకృష్ణ వెళ్ళిపోయినాడు.

ఒక్కసారిగా విరుచుకుపడే సముద్ర కెరటాలులా ఆలోచనలు విరుచుకు పడ్డాయి - వెంకట్రావు హృదయంలో, ఏమిటి! ఎప్పుడు వచ్చింది యాత్రనుంచి పద్మావతి? ఎందుకు తన్ను చూడలేదు? ఆ వెంటనే ఎందుకు కాశీ వెళ్ళినట్లు! తక్కిన పిల్లలందరూ కూడా వెళ్ళినారా?

అతడు టెలిఫోను తీసి ఆంధ్ర మహిళాసభను పిలిచినాడు. ఎవరో పలికినారు. కాశీకి పరీక్షకు వెళ్ళే బాలికలు ఇంకా వారం రోజులలోగాని బయలుదేరరని తెలిసింది.

కృతజ్ఞత తెల్పి, అతడు ఫోను పెట్టివేసినాడు.

అతనికేదో ఆవేదన ముంచెత్తుకు వచ్చినది. ఎంత అద్భుతంగా పాడుతుంది తన పద్మ! తనదేనా పద్మ? పద్మ భర్త తానేనా? చిన్ననాడు తనతో ఆడుకున్న, వయ్యారాలతో కులికిపోయిన పడుచేనా ఈనాటి పద్మ? పద్మను ఈనాటి స్థితికి తీసుకురావడమే తన

అడివి బాపిరాజు రచనలు - 7

166

జాజిమల్లి(సాంఘిక నవల)