పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఎందుకండీ ఈ కుళ్ళంకలూ? నిజంగా నాకు ఆ బుద్ది పుట్టింది. మదరాసులో ఉన్నదేలేదు. పైగా సినిమా కంపెనీ పేరు వినగానే కడుపులో దిగులుపుట్టి కదా బయలుదేరాను!”

“సరే సరే!”

నరసింహమూర్తి మేష్టారు టెలిగ్రాం ఇవ్వడానికి వెళ్ళిపోయాడు.

2

“కళకు ప్రధానాశయం ఆనందం. ఆనందం చేకూర్చుకోడానికే సంగీతం. చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, నాట్యం, సినీమా, నాటకం మొదలైనవన్నీ!” అని సంగీత దర్శకుడు రాధాకృష్ణ అన్నాడు.

“సరేనయ్యా! కాని మా నరసింహమూర్తి మేష్టారు కళలన్నీ భక్తిరూపాలనీ, కవిత్వం సాలోక్యమనీ, చిత్రమూ శిల్పమూ సారూప్యమనీ, సంగీతం సామీప్యమనీ, నాట్యం సాయుజ్యమనీ అనేవారు. ఆ మాటలు నాకు నచ్చాయి. అట్టాగే మన కథ కొంచెం లోకానికి ఏదయినా ఉపకారంగా ఉండొద్దామరి!” అంటూ బుచ్చి వెంకట్రావు, కాల్చే సిగరెట్టు ఆఖరుకాగా బల్లపై బూడిద గిన్నెలో వేసినాడు.

“ఇప్పుడు వచ్చే సినిమాలు భక్తితో కూడుకొని ఉన్నాయనా మీ ఉద్దేశం?"

“భక్తిలేదూ బండలులేవు! చచ్చు ఫిల్ములు చూడడానికి తాము సంపాదించుకొనే నాలుగురాళ్ళూ పారేసి వెడుతున్నారు. ఎంత డబ్బు బుగ్గిపాలవుతోందో.”

“ఇవాళ మనం తీసేబొమ్మ నీతిదాయకంగా ఉండాలనీ మీ వుద్దేశం వెంకట్రావుగారూ? అయితే మన లక్షా బుగ్గిపాలయిందన్న మాటే”

“అది కాదండీ! మనం అల్లేకథ అందంగా వుండాలి. మనలో అనేక ఉత్తమ విషయాలను గురించి పరివర్తనం వచ్చేటట్లూ వుండాలి. అలాంటి కథ చాలా గొప్పది. నేను ఈ మధ్య చాలా ఇంగ్లీషు సినీమాలు చూస్తున్నాను. వాటిలో కొన్ని ఎంతో బాగున్నాయి. పైగా ఈ కథలు ఎన్నాళ్ళవరకో నన్ను పట్టుకు వదలందే! అదీ విజయం ? అట్టాంటికథ అల్లాలి.”

“నేను రాసిన కథ ఎల్లా ఉందంటారు?”

“బాగానే వుందనుకోండి. కాని, అందులో అన్ని రుచులూ-”

“లేవంటారు. అదేమిటండీ! ఆ రాచకొడుకు దేశం చూడ్డానికి బయలుదేరాడు, దారిలో...”

“అబ్బబ్బా! ఏమిటండీ ఈ రాచకొడుకులూ వాళ్ళూ!

“అనగా, అనగా' అని మా అవ్వకథలు చెప్పేది. ఆ కథలో రాచకొడుకులు దేవతల్లా తోచేవారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో రాచకొడుకులు నాగేశ్వర్రావులే కాదండీ! రాచకొమరితలు అంజలీలూ దేవతా కన్నెలు వరలక్ష్ములు! అబ్బా విని ప్రాణం విసిగిపోతోంది."

“మనం విసగడం కాదుగదా ఆలోచించవలసింది? ప్రజలందరూ విరగబడి చూడడం, వాళ్ళకు నాగేశ్వరరావు వీరాధివీరులే. వాళ్ళ కర్రకత్తులు నిశితమైన వీరఖడ్గాలూ!"

అడివి బాపిరాజు రచనలు - 7

165

జాజిమల్లి(సాంఘిక నవల)