పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎల్లమందకు ఎప్పుడూ తన యిల్లు, తన గూడెం, తన వాళ్ళు జ్ఞాపకం వస్తూ ఉండేవారు. అవి ఇళ్ళు కావు. ఒక్కటే పాక, చిన్న పాక. అంత అసహ్యకరమయిన ఇళ్ళు ప్రపంచములో ఇంకోచోట ఉంటాయా?

గూడేనికి వీధులు లేవు. గూడెంలో శుభ్రతలేదు. గూడెం ఆ మోస్తరుగా ఉంటే, చచ్చిన గొడ్డు మాంసం అందరూ తింటారు. బుధవారం సంతనాడు అమ్మిన నల్లపంది మాంసం తింటారు.

ఎప్పుడుపడితే అప్పుడు మొగం కడుక్కుంటారు. పొద్దున్నే కడుక్కోవడం అవసరం లేదు. కడుక్కోనివారూ ఉన్నారు. స్నానం చెయ్యడం విధికృత్యం కాదు. ఉడుకు నీళ్లు పెట్టుకొని పగలల్లా చేసిన పనివల్ల వచ్చిన శ్రమ పోవడానికి నాలుగు కొబ్బరి డొక్కెలు పోసుకుంటారు.

గుడ్డలు ఉతకడం ఉండవచ్చును; లేకపోవచ్చును. అసలు గుడ్డలేవీ ఉతకడానికి? చిరిగిన గుడ్డలు ఏ రెండు మూడో ఉండవచ్చును. చిరిగితే తమ మొగాల యజమానులు పారవేసిన గుడ్డలు. ఏడాదికోసారి సంక్రాంతి పండుగలకు కామందు తమ కుటుంబం వారికి తలో బండపాత ఇస్తే, అవి అతి సంతోషంతో, అతి ప్రేమతో ధరించుకోవడం. ఇంక బట్టలు ఉతకడం ఆరవేయడం ఏనాడు ప్రభూ?

ధనం ఎప్పుడూ ఉండదు. యజమాని గింజలు కొలుస్తాడు. అవీ ఏడాదికోసారి ఆ గింజలు తన అమ్మో, తన నాయనమ్మో దంచడం, కొన్ని గింజలు అమ్ముకోడం, గంజితప్ప అన్నమే మెరుగు తన కుటుంబం? కూరలులేవు, పచ్చళ్ళు లేవు, పిండివంటలు తెలియవు, నెయ్యి మజ్జిగ రూపు రేఖా విలాసాలే లేవు, మేక మాంసం, కోడిమాంసం మొదలయిన వాటితో పలావులు, కురమాలు తమ జగత్తులో తమ వారు ఎరుగరు.

కాఫీ హోటళ్ళేమిటో మాదిగవారి కేమి తెలుసును? బుధవారం సంతనాడు ఒక కానీపెట్టి సోడాకొని తాగడం తానెరుగును. ఆ సోడా అయినా ఒక మహమ్మదీయునిది. పెద్ద కులాలవారు పెట్టిన దుకాణాలలో ఎవరయ్యా తమకు సోడా ఇచ్చేది? ఏ బ్రతికి చెడ్డవాని దుకాణంలోనో, ఇవి దొరికితే, ఆ కొట్టులో ఇతరులు ఎవ్వరూ కొనరు. |

హాస్టలులో ఇడ్డెనులు, పెసరట్లు, అట్లు, పకోడీలు, గారెలు, ఆవడలు, పూరీలు, బజ్జీలు, బొబ్బట్లు, ఫేణీలు, కాఫీలు చేస్తూనే ఉన్నారు. ఎన్నిరకాల కూరలు, పులుసులు, చారులు, పచ్చళ్ళు, కమ్మటి నేయి, పెరుగు.

ఇవన్నీ తింటూ ఎల్లమంద తన వారినీ, తన జాతినీ, భారతదేశంలో ఉన్న బీదవారినీ, ముష్టివారినీ తలచుకోని రోజు లేదు.

ఇవన్నీ భగవంతుని చిద్విలాసాలా? భగవంతునికి సంబంధం లేదా? భగవంతు డున్నాడా? ఉంటే ఈ తేడా లేమిటి? మనుష్యుని కర్మ అన్నారు. కర్మ ఏమిటి? ఈ భావాలు ఈ వేదాంతాలు ఈ విచారణ ఎల్లమందకు ఏమి తెలుస్తాయి.

4

ఒక్కడూ గోదావరి గట్టున కూర్చునేవాడు. దూరంగా గోదావరి. ఒకనాడు వరదలై ప్రవహించింది. ఒకనాడు నిర్మల నీలజాలై ప్రవహించింది. ఒకనాడు ఇసుకలు, ఇంకొకనాడు అంతా జలమయం. ఈ రెండు భావాలకూ మధ్య ఎన్నో తేడాలు. అన్ని


అడివి బాపిరాజు రచనలు - 7

14

నరుడు(సాంఘిక నవల)