పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుట్టుకచేత ఒక జట్టు మనుష్యులు లోకంలో ఎప్పుడూ అధోగతిపాలేనా? వారి జీవితాలకు మెట్లులేవా? ఎవరు ఈ శిక్ష విధించింది? బలవంతులు.

అమలాపురంనుంచి వచ్చిన ఒక బి.ఏ. సీనియర్ వెలనాటి విద్యార్థికీ, కాకినాడకు చెందిన ఇంకో తెలగాణ్య బ్రాహ్మణ బ్రహ్మసమాజం విద్యార్థికీ ఎల్లమందను గురించి హోరా హోరీ వాదన వచ్చింది. ఆ వాదనలో హాస్టలులోని విద్యార్థులందరూ పాల్గొన్నారు.

రామం (వెలనాటి) ఒరే! వెంకటేశ్వరరావూ, శిక్షలనేవి లోకంలో ఉన్నాయా?

వెంకటే: ఉన్నాయి. అవి నిర్మాణం చేసింది సంఘం.

రామ: ఆయా తప్పులనుబట్టి ఆయా శిక్షలు వచ్చాయి. జన్మశిక్ష, చావుశిక్ష, పదేళ్ళశిక్ష! అలాగే ఈ దేశంలో చచ్చిన గొడ్డుమాంసం తింటూ ప్రజలను చంపి కాల్చుకుతింటూ ఉన్న నరమాంసాశనులయిన వారికి ఆర్యులు సంఘ బాహ్యులుగా శిక్ష విధించారు.

వేంకటే: శిక్ష విధించినవారు ఏదైనా మహత్తర కారణం ఉంటే ఆ శిక్ష తీసివేస్తారా? వెయ్యరా? ఉరిశిక్ష కూడా తగ్గిస్తారు; ప్రభుత్వంవారు జన్మశిక్షలు తగ్గించి వదలి వేసిన సాక్ష్యాలున్నాయి. వెనక ఆర్యులు శిక్ష విధించారే అనుకో! ఇప్పుడు ఆలోచించి ఆ శిక్ష తగ్గించవచ్చునుకాదా?

ఒక విద్యార్థి: ఒరే! ఇప్పుడు మనదేశం అంతకూ ఆంగ్లేయులు శిక్ష విధించారు కాదట్రా!

రామ: అప్పటి ఆర్యులు ఈ శిక్ష ఎప్పటికీ తగ్గించకుండా ఉండే నిబంధన కూడా ఆ శిక్షలోనే విధించారు. అందుకని ఈ మాల మాదిగలు ఎల్లకాలం అల్లా ఉండవలసిందే!

ఇంకో విద్యార్థి: మనకు మెలిమొగుళ్ళయిన ఇంగ్లీషువాళ్ళు ఈ హరిజనులకు శిక్ష తగ్గించి, వాళ్ళను మనకు ప్రభువులను చేసి ఆ ప్రభుత్వం సాగేందుకు తమ సైన్యం అంతా మద్దతు చేస్తే ఏమి చేస్తారురా మీరు?

మరో విద్యార్థి: మన దేశంలో మార్పులు మనమే తీసుకురావాలి! ఈ తెల్లనాయాళ్ళు ఎవరురా?

రామ: అలాంటి మార్పులు ఎవరు తీసుకు రాబోయినా లోకం అంతా కొల్లేరయి చక్కాబోతుంది.

వెంక: ఓయి వెర్రికాయా! వట్టి మాష్టారూ! ఇంగ్లీషువాళ్ళు మూడువందల సంవత్సరాల నుంచి ఈ బాపనోళ్ళను గొడ్డుతోళ్ళ బూట్లతో నెత్తిన తంతున్నారు. ఈ ఎదవాయలు వంగి వంగి దణ్నాలెడుతూ, దీర్ఘాయుష్మాన్ భవ అని ఎదురు ఆశీర్వదిస్తున్నారోయి.

రామ: అందుకనే ఒకనాడు ఇంగ్లండు యావత్తూ నాశనం అయి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోతుంది.

ఒక విద్యార్థి: అప్పుడు ఈ బాపనోళ్ళంతా, ఈ పెద్ద కులాల బ్రాహ్మణేతరులు వాళ్ళంతా ఏ పురుగులో, ఏ నల్లులో అయి చక్కాబోతారు.

ఈలాంటి చర్చలు ఎన్నో ఎల్లమంద వింటూనే ఉన్నాడు. ఎల్లమందకు చర్చ లెప్పుడూ తృప్తి కలిగించలేదు. అతడు ఎక్కువగా చర్చలలో పాల్గొననూలేదు.

ఒక్క స్నేహితుడూ ఎల్లమందను తనింటికి భోజనానికిగాని, ఆఖరికి సరదాగా గాని పిలవలేదు. మాలవారూ, మాదిగవారూ, క్రైస్తవులయినవారు హిందూ పెద్ద కులాల వారింటికి కాఫీ వగయిరాదులకు వెడుతూ ఉండేవారు.


అడివి బాపిరాజు రచనలు - 7

13

నరుడు(సాంఘిక నవల)